విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామం (UNEP) వారు మే 25 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు ఫ్రాన్స్ లోని ప్యారిస్ నగరంలో “నగరాలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి అంతర్జాతీయ ఫోరమ్”ను నిర్వహించడమైనది. హౌసింగ్ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి సన్నిహిత సహకారంతో ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వహించడము మరియు నగరాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయుట అనే ప్రక్రియ దేశ వ్యాప్తంగా బలోపేతం చేయుటయే ఈ ఫోరమ్ యొక్క ప్రధాన లక్ష్యం.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐఏఎస్., అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రతిష్ఠ మాంగైన్, ఐఏఎస్., పోర్ట్ బ్లెయిర్ కార్యదర్శి స్మిత ఆర్., ఐఏఎస్., లు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామం (UNEP) వారి ఆహ్వానం మేరకు ఈ అంతర్జాతీయ సదస్సు నందు పాల్గొని, ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించడంలో మరియు నియంత్రించడంలో వారి యొక్క అనుభవాలను, అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను, వారి అభిప్రాయాలను ఆ సదస్సు నందు తెలియచేయుట జరిగినది.
విజయవాడ నగరములో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు విజయవాడ నగర పాలక సంస్థ సుస్థిరమైన మరియు సమ్మిళిత విధానంపై దృష్టి సారించిందనియూ మరియూ అందుకు అవసరమైన చర్యలు ఇప్పటికే తీసుకొనుట జరుగుతున్నదనియూ, అందుకు గాను విజయవాడ నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించడంలో మరియు నియంత్రించడంలో ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయటం జరుగుచున్నదని విజయవాడ నగర కమీషనరు శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అంతర్జాతీయ సదస్సు నందు తెలియచేసినారు. అదే సమయంలో మిగిలిన ప్రతినిధులు కూడా తమ ప్రాంతాలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడానికి స్థిరమైన మరియు సమ్మిళిత విధానంపై దృష్టి సారించినట్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
నగరాలు మరియు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ మరియు పునర్వినియోగాన్ని పర్యవేక్షించుటకు మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం జాతీయ స్థాయి మార్గదర్శకాలను అనుసరించుటకు గాను జాతీయ డిజిటల్ ప్లాట్ఫారం ను ఏర్పాటు చేయాలని ఫోరంలో ప్రతిపాదించబడింది.
పారిస్ నగరానికి చెందిన మేయర్ అతిదులకు విందు భోజనము ఏర్పాటు చేయుట జరిగినది. సదరు విందు కార్యక్రమము నందు పట్టణాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశములు, ముఖ్యముగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టితో చర్చించుట కూడా జరిగినది.
Prajavartha Online Telugu News