Breaking News

సాగునీరు, మద్దతు ధర మా ప్రభుత్వానికి ప్రాధాన్యతలు..

-జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తాం..
-నిధుల కొరత లేదు..
-గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రైతులకు ఖరీఫ్‌ కోసం సాగునీటిని ఏ ప్రభుత్వంలోనూ జూన్‌ నెల ప్రారంభంలోనే విడుదల చేసిన చరిత్ర లేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.
కృష్ణా జిల్లా 38వ, ఎన్‌టిఆర్‌ జిల్లా 2వ నీటి పారుదల సలహా మండలి సమావేశం మంగళవారం నగరంలోని నీటిపారుదల సర్కిల్‌ ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 7వ తేది బుధవారం ఖరీఫ్‌ పంటకు కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన రైతులకు స్వర్ణ యుగం లాంటిదని, వర్షాలు పుష్కలంగా కురిసి జలాశయాలన్నీ నిండు కుండలా తొణికిసలాడుతున్నాయన్నారు. పంటలు బాగా పండటం, దిగుబడి కూడా అధికంగా రావడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభించిందన్నారు. ఇదేవిధంగా ఈ ఏడాది కూడా దేవుని దయతో వర్షాలు సంతృప్తికర స్థాయిలో కురిసి, జలాశయాలు నిండుతాయని ఆశిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ కాలంలో ప్రతి ఏడాది కృష్ణా డెల్టాకు సాగు నీటిని ఎప్పడు విడుదల చేస్తారనే అయోమయంలో రైతులు ఆందోళనకు గురి అయ్యేవారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సకాలంలో ఖరీఫ్‌ పంటకు సాగు నీటిని విడుదల చేస్తున్నామని, గత ఏడాది కూడా జూన్‌ 10వ తేదీనే కృష్ణా డెల్టాకు సాగు నీటిని విడుదల చేశామని తెలిపారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని నిల్వ చేసుకునేందుకు వీలుగా కృష్ణా డెల్టాదిగువ ప్రాంతంలో రెండు బ్యారేజ్‌లు నిర్మించేందుకు అంచనాలు రూపొందించామన్నారు. ఎగువ ప్రాంతంలో దాములూరు వద్ద బ్యారేజ్‌ నిర్మించేందుకు కూడా అంచనాలు రూపొందించామని వీటికి పాలన అనుమతులు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి జీవనాడిగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంచనాలను సవరించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి ఫలించి కేంద్రం క్యాబినేట్‌ సమావేశంలో తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా శంకుస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.
ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని సాగునీటి పంపిణీలో ఏమైనా లోపాలు, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కృష్ణా డెల్టాకు విడుదల చేయనున్న సాగునీటి వివరాలను తెలిపారు.
కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలోని సాగునీటి కాలువల మరమత్తు పనులకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ఏప్రిల్‌, మే నెలలోనే పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులు పూర్తి చేసుకుని జూన్‌ నెలలో సాగునీరు విడుదల చేసే సమయానికి కాలువలు సిద్దంగా ఉంటాయన్నారు.
సమావేశంలో ఏపి స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ యం వి వి నాగిరెడ్డి, పామర్రు శాసన సభ్యులు కైలా అనీల్‌కుమార్‌, శాసన మండలి సభ్యులు మొండితోక యం.అరుణ్‌కుమార్‌, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ తమతమ నియోజకవర్గాల పరిధిలో పంట కాలువలు, మిని సాగునీటి ప్రాజెక్టులలో జరుగుతున్న పనులను సత్వరమే పూర్తి చేయాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
సమావేశంలో ఇరిగేషన్‌ ఎస్‌ఇ తిరుమలరావు, పులిచింతల ఎస్‌ఇ శ్రీరామకృష్ణ, ఏఇలు, డిఇలు, తదితరలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *