-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 9వ తేదీన జరిగే ముఖ్యమంత్రి గుడివాడ పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 9 వ తేదీన జిల్లాలోని గుడివాడ మండలంలో మల్లాయపాలెంలో 77.46 ఎకరాల్లో 8,912 టిడ్కో గృహాలను ప్రారంభిస్తున్న నేపథ్యం లో బుధవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జిల్లా ఎస్పీ పి. జాషువాతో కలిసి ముందస్తు భద్రత సమన్వయ సమావేశం ( ఏఎస్ఎల్ ) నిర్వహించారు.
తొలుత పలువురు అధికారులతో హెలిప్యాడ్, టిడ్కో గృహ నిర్మాణాలు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శిలా విగ్రహం,బహిరంగ సభ ప్రాంతాన్ని పర్యవేక్షించారు
అనంతరం టిడ్కో గృహ సముదాయాల సమీపంలో గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని), జిల్లా ఎస్పీ పి. జాషువా,అడిషనల్ ఎస్పీలు ఎస్విడి ప్రసాద్, శ్రీహరి, టిడ్కో ప్రాజెక్ట్ అధికారి చిన్నోడు, గుడివాడ ఆర్టీవో పద్మావతి, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి రమణ, ఐ ఎస్ డబ్ల్యు డీఎస్పీ రంగబాబు, గుడివాడ డి.ఎస్.పి శ్రీకాంత్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు. ముఖ్యంగా రెండు ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గుడివాడలో హెలిప్యాడ్, బహిరంగ సభ వద్ద పక్కా బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికే ప్రముఖుల జాబితా సిద్ధంగా ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా పరిశ్రమల శాఖ అధికారి హెలిప్యాడ్ ఇంచార్జ్ వెంకట్రావు, కోడూరు, పామర్రు తాహిసిల్దార్లు లతీఫ్ బాషా, భరత్ రెడ్డికు సూచించారు, హెలిప్యాడ్ సమీపంలో ఒక షామియానా ఏర్పాటు చేసుకొని 50 కుర్చీలు అక్కడ ఉంచుకోవాలన్నారు. అలాగే బయో టాయిలెట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే, ముఖ్యమంత్రి వెంట కాన్వాయ్ లో వచ్చే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లేందు కోసం కండిషన్ గల మంచి వాహనాలను సమకూర్చాలన్నారు
టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులు ఉండేలా చూడాలని అవసరమైతే సీఎం వారితో మాట్లాడే అవకాశం ఉందని ఎంపిక చేసిన టిడ్కో గృహాల వద్ద లబ్ధిదారులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలు, విఐపి లకు పార్కింగ్ విడివిడిగా ఏర్పాటు చేస్తూ పార్కింగ్ స్థలం వద్ద వాహనాలను సక్రమంగా ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని డిటిఓ సీతాపతిరావుకు కలెక్టర్ ఆదేశించారు. సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీ లో తాగునీరు, మజ్జిగ, స్నాక్స్ తదితర ఏర్పాట్లు అన్నిటిని పక్కాగా చేపట్టాలని, అలాగే అందుకు తగిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని గ్యాలరీ ఓవరాల్ ఇన్చార్జికి జిల్లా కలెక్టర్ సూచించారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున అందరికీ తగినంత త్రాగునీరు అందేలా తాగునీటి వసతి కల్పించాలని అందుకు తగిన సిబ్బందిని కేటాయించి సక్రమంగా నీటిని అందించేలా ఏర్పాటు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారికి సూచించారు. అంబులెన్స్ సిద్ధం చేసుకుని అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. బహిరంగ సభ వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయ్, డిసిహెచ్ ఇందిరాదేవికు కలెక్టర్ తెలిపారు. ప్రజల్లో ఎవరికైనా వడదెబ్బ తగిలితే, ఓ ఆర్ ఎల్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సభాస్థలి వద్ద నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ డి ఈ కు తెలిపారు, అలాగే విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్ లను కూడా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం జిల్లా పి జాషువా మాట్లాడుతూ, హెలిప్యాడ్ వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని, పోలీస్ బందోబస్తు సక్రమంగా ఉండి పలుచోట్ల తనిఖీలు ముమ్మరంగా చేయాలన్నారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికే సమయంలో ప్రజలు ముందుకు చొచ్చుకు రాకుండా అటువంటివారిని నిలువరించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి శిలావిగ్రహం ఉన్న ప్రాంతం వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంచాలన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో 24 గంటలు పెట్రోలింగ్ గుడివాడ టౌన్ లో పోలీసులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. బహిరంగ సభ జరిగే సమయంలో ఎటువంటి గందరగోళ పరిస్థితులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
Prajavartha Online Telugu News