-రైతులకు ఖరీఫ్ లో సాగునీటికి ఇబ్బంది లేదు…
-పులిచింతల ప్రాజెక్టులో 34 టిఎంసిల నీటి నిల్వ…
-ముందస్తు పంటల సాగుకు రైతులు సిద్ధం కండి…
-రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సాగునీటిని బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లా కలెక్టర్ ఎస్ ఢల్లీి రావు, శాసనసభ్యులు, అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించి కాలువకు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కృష్ణా డెల్టా రైతాంగానికి ఈ ఖరీఫ్ సీజన్లో ముందుగానే సాగునీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. కృష్ణా డెల్టాకు కుడి ఎడమవైపు గుంటూరు, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. గతంలో జూన్ నెలాఖరు, జూలై నెలలో సాగునీటిని విడుదల చేసేవారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో రైతులకు ఖరీఫ్ లో ముందుగానే సాగునీరు అందించేందుకు ఇచ్చిన ఆదేశాలతో నెల ముందుగానే పంటలకు సాగు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. గత సంవత్సరం జూన్ 10వ తేదీన నీటిని విడుదల చేశామని గుర్తు చేస్తూ ఈ ఏడాది మూడు రోజులు ముందుగానే సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. ఖరీఫ్ లో సాగునీటిని ముందుగానే అందించడం వల్ల రైతులు మూడు పంటలు పండిరచుకునేందుకు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో 34 టీఎంసీల నీటి నిల్వ ఉందని అన్నారు. నీరు సమృద్ధిగా ఉండడంతో పట్టిసీమ నుండి నీటిని తీసుకువచ్చే అవసరం లేదన్నారు. ఈ ఏడాది వర్షాలు పుష్పలంగా కురుస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ నుండి కూడా నీరు విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. ముందస్తుగా రైతులు పంటలను సాగు చేసుకోవడంతో మేలు జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తొలి దశలో అవసరమయ్యే 12,911.15 కోట్ల రూపాయల వ్యయాన్ని ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించడం శుభ పరిణామం అన్నారు. ప్రాజెక్టు పనులు శరవేయంగా జరుగుతున్నాయని తమ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కృష్ణా నదికి వచ్చే వరద నుండి నగరవాసులకు రక్షణగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం మూడవ దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా దేవుని దయతో వర్షాలు పుష్కÛలంగా కురిసి ప్రాజెక్టులలో నీరు సమృద్ధిగా ఉండి జలకళను సంతరించుకున్నాయన్నారు. రైతులకు మేలు జరిగి దిగుబడి అధిక మొత్తంలో రావడంతో మద్దతు ధర లభించి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. పులిచింతల ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేశామని, ఆయన పరిపాలనలోనే ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరిగి పూర్తి చేయడంతో 34 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి నేడు రైతుల అవసరాలు తీరుస్తుందని మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు,మల్లాది విష్ణువర్ధన్, దూలం నాగేశ్వరరావు, జన వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. నారాయణ రెడ్డి, ఆర్ సతీష్ . డిప్యూటీ ఇఎన్ సి శివప్రసాద్ రెడ్డి, ఎస్ ఇఎస్. తిరుమల రావు, ఇఇలు పివిఆర్ కృష్ణారావు, కే .బాబు, ఎఇఇ దినేష్ ఉన్నారు.
Prajavartha Online Telugu News