-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా విక్రయ కేంద్రాలు ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహిరంగ మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలకు నిత్యావసరాలను సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టినట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. పాయకాపురం రైతు బజార్లో బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను స్థానిక కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి.. సబ్సిడీపై నాణ్యమైన బియ్యం, టమాటా, దేశవాళి కందిపప్పు వంటి సరుకులను తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు మల్లాది విష్ణు తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కిలో టమాటా రూ.50., కిలో సోనా మసూరి బియ్యం రూ.49., బి.పి.టి. రకం కేజీ రూ. 46., కందిపప్పు రూ. 135 చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించారు. ఈ కేంద్రాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రైతు బజార్లలో తూనికలు, ధరల పట్టికలను మల్లాది విష్ణు పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు తక్కువ ధరకు అందుతున్నదీ, లేనిదీ వినియోగదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. బోర్డులపై రాసిన ధరలు అందరూ పాటించాలని ఎలాంటి వ్యత్యాసాలు రాకూడదని దుకాణదారులకు సూచించారు. ప్రతి దుకాణం వద్ద శుభ్రత పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్ బాబు, ఏఎస్ఓ(సర్కిల్-3) ధనుంజయరెడ్డి, ఏఎస్ఓ(సర్కిల్-1) శ్రీలక్ష్మి., ఆర్ఐ శరత్ బాబు, నాయకులు అలంపూరు విజయ్ కుమార్, రామిరెడ్డి, బోరా బుజ్జి, హైమావతి, సుభాని, వీరంకి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News