విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు, అభాగ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 6.60 లక్షల విలువైన చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. వీరిలో వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న అజిత్ సింగ్ నగర్ కు చెందిన పకీరు కీర్తి(15)కి రూ. 3 లక్షల ఎల్ఓసి పత్రం మంజూరైనట్లు మల్లాది విష్ణు తెలిపారు. అలాగే హృద్రోగంతో బాధపడుతున్న జి.రాజేశ్వరి(75)కి రూ. లక్షా 40 వేలు., మద్రాసులో రోడ్డు ప్రమాదానికి గురైన కాళిశెట్టి భార్గవ్ నాయుడికి చికిత్స నిమిత్తం రూ.2.20 లక్షలు విడుదలైనట్లు వెల్లడించారు. చంద్రబాబు పాలనలో వైద్య ఆరోగ్యశాఖ వెంటిలేటర్ పై ఉండేదని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత శాఖకు జీవం పోశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని.. ఈ ప్రభుత్వంలో ఏకంగా 3,118 ప్రొసీజర్లకు పథకం వర్తింపచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని అనేక రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకోవచ్చన్నారు. కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు ఆపద వస్తే అధైర్యపడొద్దని సూచించారు. గొప్ప మానవతావాది సీఎంగా లభించడం పేదల అదృష్టమని.. వైద్య ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంస్కరణలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. సమస్యను తమ దృష్టికి తీసుకెళ్లిన వెనువెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి లబ్ధిదారుని కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News