మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల వైయస్సార్ జగనన్న గృహాల నిర్మాణం పూర్తయిందని, మరో పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, ఆలోగా నిర్మాణం పూర్తయిన అన్ని లేఔట్లలో స్వాగత తోరణాలను ఏర్పాటుచేసి, ఆ గృహాలకు విద్యుత్తు, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం నగరంలోని మాచవరం మార్గంలో గల జీ కన్వెన్షన్ హాలులో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పురోగతిపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే రాష్ట్ర ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. గత 40 ఏళ్లుగా ఎన్నడూ లేనివిధంగా 30.60 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఇందులో మొదటి విడతలో 5 లక్షల గృహాలను నిర్మించడం గొప్ప విషయం అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవడం అందరూ గర్వంగా భావించాలన్నారు. అందులో జిల్లాలో 22 వేల గృహాల నిర్మాణం పూర్తి చేసినందుకు అధికారులు అందర్నీ అభినందిస్తున్నానన్నారు. ఈ 5 లక్షల గృహాలను వచ్చే 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారన్నారు.
ఆలోగా అన్ని లేఔట్లలో స్వాగత తోరణాలను పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మేకవాని పాలెంలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం కోసం 12000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. అలాగే ఇంకుడు గుంతల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. ప్రతి ఇంటికి నిర్ణయించిన రంగులను తప్పనిసరిగా వేయించాలన్నారు.
మరలా వచ్చే ఐదు నెలల్లో మరో 5 లక్షల గృహాల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నారు. పునాది స్థాయిలో ఉన్న ఇళ్లను పైకప్పు స్థాయికి తీసుకురావాలన్నారు. అలాగే ప్రతి స్థాయి నుండి తర్వాతి స్థాయికి గృహ నిర్మాణాన్ని తీసుకువచ్చేందుకు ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ ఇల్లు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని, ప్రతి కుటుంబానికి గౌరవం తెచ్చి పెట్టేదన్నారు. గత 40 సంవత్సరాలుగా సాధించలేనిది ఇంత వేగంగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం గొప్ప సాధన అన్నారు.
స్థానిక శాసనసభ్యులతో సంప్రదించి స్వాగత తోరణాల నిర్మాణానికి చొరవ చూపి తక్షణమే పనులు ప్రారంభించాలన్నారు.
ప్రభుత్వం చెప్పిన విధంగా రెండో విడత లక్ష్యాన్ని ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పోటీ తత్వంతో చురుగ్గా పాల్గొని పూర్తి చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 35 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి గృహ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషిచేసి గృహాల లబ్ధిదారులను చైతన్యపరిచి ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు.
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఒక వ్యూహరచన చేసి అందుకు అనుగుణంగా అమలు పరచాలన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్తు, మంచినీరు సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలన్నారు. ప్రతి రోజు వారి పురోగతిని సమీక్షించుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి షాను, జిల్లా కలెక్టర్ పి.రాజా బాబును, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ను హౌసింగ్ పీడీ జీవీ సూర్యనారాయణ, హౌసింగ్ అధికారులు ఘనంగా సత్కరించారు.
ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ డి ఎ బి డి పిఎస్ఆర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, పలువురు ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ ఇంజనీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News