తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం -ఆంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయి వరకు గల యువతలోని క్రీడాస్పూర్తిని పెంపొందించడం, వారిలో క్రీడాకారులను గుర్తించడం అని ఈ కార్యక్రమానికి సామాజిక బాధ్యతగా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇతర దాతలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.
సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆడుదాం- ఆంధ్ర కార్యక్రమం అమలు కొరకు ఏర్పాట్లపై సి ఈ ఓ, సెట్విన్ మురళి కృష్ణ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెరిట్ సర్టిఫికెట్ మరియు ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయి పోటీల నుండి అందించబడుతుందని, వాటికి సంబంధించి టీ షర్ట్లు, టోపీ లు, వసతి భోజనం తదితరాల ఏర్పాటు అవసరమవుతుందని దాతల నుండి నిధులు అవసరమవుతాయని సీఈవో సెట్విన్ తెలుపగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో 691 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో సుమారు ఒక లక్ష 57 వేల 548 మంది క్రీడాకారులు, మండల స్థాయిలో 78,774 మంది క్రీడాకారులు, నియోజకవర్గ స్థాయిలో 3,876 మంది క్రీడాకారులు, జిల్లా స్థాయిలో 798 మంది క్రీడాకారులు, రాష్ట్రస్థాయిలో 114 మంది క్రీడా కారులు పాల్గొననున్నారు అని అన్నారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొనుటకు వచ్చే క్రీడాకారులకు భోజన వసతికి, ఇతర సదుపాయాలకి పారిశ్రామిక వేత్తలు, ఇతర దాతలు నిధుల రూపేణా, వస్తు రూపేణా కానీ సహకారం అందించాలని కోరుతూ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నరేంద్ర, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణ రెడ్డి, డిప్యూటీ జెడ్ఎం ఏపీఐఐసి జవహర్ పరిశ్రమలు ఇతర యాజమాన్యాలతో సమన్వయం చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డా.అరుణ సులోచన పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
Prajavartha Online Telugu News