– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-29 వ డివిజన్ 207 వ సచివాలయ పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజల ఆశీర్వాదమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బలమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 29 వ డివిజన్ 207 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి ఆయన పాల్గొన్నారు. మధురానగర్లోని సాయిబాబా కాలనీలో విస్తృతంగా పర్యటించి.. 271 గడపలను సందర్శించారు. సంక్షేమ పథకాల బుక్ లెట్లతో పాటు.. పలువురికి నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను అందజేశారు. ప్రతి పేద కుటుంబానికి అండగా తాము ఉన్నామనే బలమైన నమ్మకాన్ని గత నాలుగేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం కల్పించిందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు ఒక్కసారి మాటిస్తే కచ్చితంగా నెరవేర్చే ముఖ్యమంత్రి ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్ అయితే.. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా దళారులు లేకుండా, అవినీతిరహిత పాలన అందిస్తుండటంతో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సీఎం జగన్ గూర్చి మాట్లాడే అర్హత బాలకృష్ణకు లేదు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అవినీతికి పాల్పడని వ్యక్తి ఏ స్థాయి వాడైనా శిక్షార్హుడే అన్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గ్రహించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు అడ్డగోలుగా ప్రజాధనాన్ని షెల్ కంపెనీల పేరిట లాటీ చేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైందన్నారు. కనుకనే చంద్రబాబుపై ప్రజల్లో ఏమాత్రం సానుభూతి లేదని పేర్కొన్నారు. అటువంటిది బాబుది అక్రమ అరెస్ట్ అంటూ బాలకృష్ణ ఏవిధంగా మాట్లాడతారని మల్లాది విష్ణు అన్నారు. ఏనాడూ హిందూపురం వైపు కనీసం తొంగిచూడని బాలకృష్ణ.. బావ కోసం మాత్రం షూటింగ్‌లు వదిలేసి ఆగమేఘాలపై వచ్చి మరీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతున్ని చేసి ఘోరంగా అవమానించినప్పుడు కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా..? అని సూటిగా ప్రశ్నించారు. మీ బావ తప్పు చేయలేదని ఆయన తరఫు లాయర్లే వాదించడం లేదని.. అలాంటిది అక్రమ అరెస్టు అంటూ ప్రభుత్వం మీద, సీఎం జగన్ పైన దుష్ప్రచారం చేయడమేంటని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబుకు పూర్తి భద్రత ఉందని.. ఆయన కోరిన రీతిలో అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. కనుక రాజకీయం కోసం భద్రత లేదంటూ దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ(యూజీడీ & వాటర్ సప్లై) రామకృష్ణ, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు కంభం కొండలరావు, చీమల గోవింద్, సముద్రపు గోవింద్, శనగశెట్టి హరిబాబు, దేవినేని సుధాకర్, పూర్ణిమ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News