విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాలివాహను (కుమ్మరి)లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారిని అభివృద్ది వైపుకు నడిపించేలా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
రాష్ట్ర కుమ్మరి/శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ యం పురుషోత్తం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కుమ్మరి/శాలివాహన సంక్షేమ కమిటీ సభ్యులు, చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్డాడుతూ జిల్లాలో శాలివాహన (కుమ్మరి) వర్గాలకు చెందిన వారు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. శాలివాహనులకు సమాజంలో సముచిత స్థానం కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు.
శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ యం పురుషోత్తం మాట్లాడుతూ శాలివాహన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో శాలివాహన(కుమ్మరి) పెడరేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాద యాత్రలో శాలివాహన వర్గాల కష్టాలను స్వయంగా చూసి సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామి మేరకు రాష్ట్ర స్థాయిలో శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనితో పాటు అన్ని జిల్లాలలో జిల్లా స్థాయి శాలివాహన సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదిన ప్రముఖ కవియిత్రి మొల్ల జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్లాస్టిక్ వాడక నిషేదం అమలులో ఉన్నందున ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల మట్టికప్పులను వినియోగించేలా చర్యలు తీసుకోవడం ద్వారా శాలివాహనులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. శాలివాహనుల వర్గాల ఇనామ్ భూములను వారికే వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఆయా వర్గాల ప్రజలలో హర్షం వ్యక్తం చేస్తున్నాయని చైర్మన్ యం పురుషోత్తం అన్నారు.
జిల్లా స్థాయిలో కుమ్మరి/ శాలివాహన జిల్లా సంక్షేమ సంఘానికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గాను, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా కో`ఆపరేటివ్ ఆఫీసర్, జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డిబిసిఎస్‌సిఎస్ లిమిటెడ్ ఇడి, మున్సిపల్ కమీషనర్, డిస్టిక్ట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ నియమాక పత్రాలను అందజేశారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో శాలివాహన (కుమ్మరి) జిల్లా సంక్షేమ సంఘం సభ్యులు పి.చెన్నయ్య, టి దుర్గాప్రసాద్, ఆర్ కృష్ణయ్యలు ఉన్నారు.
Prajavartha Online Telugu News