– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-32 వ డివిజన్ 231 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల ఇంట సంక్షేమ పథకాల పంట పండుతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32 వ డివిజన్ 231 వ వార్డు సచివాలయ పరిధిలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణితో కలిసి రామలింగేశ్వర పేటలో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. 205 గడపలను సందర్శించి.. ప్రజలతో మమేకమయ్యారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో అవినీతి రహిత పాలనను అందిస్తూ.. ప్రతి ఇంటికి నవరత్నాల పథకాల ద్వారా సీఎం జగన్ లబ్ధి చేకూరుస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసే విధంగా సుపరిపాలన అందిస్తున్నారన్నారు.
డివిజన్ కు సరికొత్త రూపాన్నిచ్చింది వైసీపీ ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో రూ. 7 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎటు చూసినా సమస్యలే ఎక్కువగా కనపడేవని.. ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు వెల్లడించారు. 2019 కి ముందు చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లన్నీ జలమయం అయ్యేవని గుర్తుచేశారు. కానీ నేడు ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయని.. అంతర్గత రహదారుల నిర్మాణంతో అనూహ్య రీతిలో ప్రాంతం కొత్త సొబగులు దిద్దుకుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. లోటస్ సెక్టార్ లో రూ. 6 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. రూ. 40 లక్షలతో ఆర్చ్ రోడ్డును, రూ. 15.35 లక్షలతో శానిటరీ కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించుకున్నట్లు గుర్తుచేశారు. బసవతారకనగర్లో రూ. 18 లక్షల నిధులతో 9 రోడ్లు నిర్మించుకుంటున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం చేతగాక వదిలేసిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణాన్ని.. ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని రూ. 17 లక్షలతో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో భాగంగా ప్రారంభించుకున్న అయోధ్యనగర్ అర్బన్ హెల్త్ సెంటర్.. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ వైద్య కేంద్రంలో 24 రకాల వైద్య పరీక్షలు, 172 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని.. కనుక పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు.
బాబు హయాంలో జరిగిన మంచి ఒక్కటీ లేదు
చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మంచి ఒక్కటీ లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్న సురక్ష, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలతో ప్రజలకు అనేక రకాలుగా మేలు చేకూరుతోందన్నారు. కనుకనే ఈ ప్రభుత్వానికి రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతోందని తెలిపారు. సీఐడీ విచారణ నుంచి బయటకు వచ్చి నిజాయితీపై లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ మునిగిపోయిన నావ అని.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగలేక జనసేనపై ఆధారపడుతోందని ఎద్దేవా చేశారు. ఎంత మంది కలసి వచ్చినా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు గుండె సుందర్ పాల్, ఒగ్గు గవాస్కర్, గుడిసె శ్యామ్, బత్తుల సుబ్బారావు, వెంకటేశ్వరరెడ్డి, ఆదిరెడ్డి, పేరం త్రివేణిరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News