– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల ఇంటి ముంగిటకే మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష అనే చారిత్రాత్మక కార్యక్రమానికి కారం చుట్టారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుణదలలోని విజయమేరీ ఫంక్షన్ హాల్ నందు శుక్రవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం వద్ద ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్, డాక్టర్ కన్సల్టేషన్ గదులు, ల్యాబ్ పరీక్షలు, మందులిచ్చే కౌంటర్లలో ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. హౌస్ సర్వేలో నమోదు కాని వారిని సైతం వైద్య శిబిరంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ ను సందర్శించి.. మహిళలకు అవగాహన కల్పిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలకు వరం లాంటిదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇంటింటి ఆరోగ్య సర్వే ద్వారా ఏడు రకాల పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. డివిజన్లోని 1, 3, 238 వార్డు సచివాలయాల పరిధిలో 3,550 (95%) కుటుంబాలకు సంబంధించి 11,193 మందిని ఆరోగ్య సిబ్బంది కలిసినట్లు తెలిపారు. వీరందరికీ 7,318 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. 1,338 టోకెన్లు అందజేసినట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. సాధానణ వ్యాధులకు అక్కడే మందులు అందిస్తున్నట్లు వెల్లడించారు. చికిత్స తీసుకోవాల్సిన రోగులకు వైద్య శిబిరాలలో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నయం అయ్యేంతవరకు సరిపడా మందులు అందించడం జరుగుతుందన్నారు. వ్యాధి తీవ్రత ఆధారంగా మెరుగైన చికిత్స కోసం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు సిఫారసు చేసి పూర్తిస్థాయిలో వైద్యాన్ని అందించనున్నట్లు చెప్పారు. విజయవాడ నగరంలో ప్రస్తుతం 29 ఆస్పత్రులలో పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 71,982 కుటుంబాలు ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకున్నట్లు వెల్లడించారు. వీరందరికీ గత నాలుగేళ్లలో 160 కోట్ల రూపాయల సేవలు అందించినట్లు తెలియజేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కానీ నేడు గ్రీన్ ఛానల్ ద్వారా పారదర్శకంగా చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. అలాగే ప్రజల అవసరాల దృష్ట్యా అర్థరాత్రి వేళలలోనూ ముగ్గురు పర్యవేక్షకులను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం జరిగిందని.. వారి నెంబర్లను జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల వద్ద ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. హృద్రోగులకు అత్యవసర సమయంలో సేవలందించేందుకు గానూ జీజీహెచ్ లో రూ. 45 వేలు ఖరీదు చేసే స్టెమీ ఇంజక్షన్లను సైతం అందుబాటులో ఉంచినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. మరోవైపు రోగులు కూడా ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై అవగాహన కలిగి ఉండాలని.. అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురికాకుండా ఆరోగ్య మిత్రల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలందరూ పూర్తి స్థాయిలో వినియోగించుకొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు ఉద్ధంటి సురేష్, బండి వేణు, మానికొండ సాంబశివరావు, కొంగితల శివ, కంభం కొండలరావు, భోగాది మురళి, రఫీ, శనగశెట్టి హరిబాబు, శేఖర్, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News