విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై నేటికి 4 రోజులు. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు ఎంతో సంతృప్తికరంగా ఆనంద పారవశ్యంతో అమ్మవారి నిత్యాన్నదానాన్ని తృప్తిగా స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడా ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం చేసిన ఏర్పాట్లు వారికి ఎంతో సంతోషాన్ని కలగజేసాయి. క్యూ లైన్ లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన భక్తులు ఈ దేవస్థానంలో సామాన్య భక్తుల దర్శనం కోసం చేసిన ఏర్పాట్లు ఎంతో బాగున్నాయని దేవస్థానం యంత్రాంగాన్ని ప్రశంసిస్తున్నారు. అందరితో సమానంగా దర్శనం చేసుకోలేని ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్ధుల కోసం చేసిన ఏర్పాట్లు మరే ఇతర దేవస్థానంలోనూ లేవని చెప్పడం గమనార్హం. ఇదే క్రమంలో దర్శనం కోసం వస్తున్న భక్తులకు వారు ఉంటున్న ప్రదేశంలోనికి మంచినీరు, మజ్జిగ, పసి పిల్లల కోసం వేడి పాలను సైతం క్యూ లైన్ లో అందించడం ఒక నూతన ఒరవడిగా వారు అభివర్ణిస్తున్నారు. అకస్మాత్తుగా ఎవరైనా అనారోగ్యం వల్ల కానీ, ఇతరేతర కారణాలతో కానీ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అవసరమైన వైద్య సేవలు కూడా తక్షణమే అందించేందుకు దేవస్థానం పాలకమండలి చేసిన ఏర్పాట్లు గతంలో ఎప్పుడూ చూడలేదని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వ్యాఖ్యానించడం విశేషం. భక్తులకు అవసరమైన ప్రతి అవసరాన్ని తీర్చేందుకు వేలాదిమంది స్వచ్ఛంద కార్యకర్తలు నిరంతరం భక్తులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. ఈ దేవస్థానంలో కొన్ని వందల సంవత్సరాలుగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం సాధారణ భక్తులను దృష్టిలో పెట్టుకుని చేసిన ఏర్పాట్లు మాత్రం క్రమ పద్ధతిలో సాగుతున్నాయని భక్తులు తమ అనుభవాలను చెప్పడం దేవస్థానం పాలకమండలి చేసిన ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేవనేందుకు ఒక ఉదాహరణ. ప్రత్యేక దర్శనాల ద్వారా వస్తున్న వారికి కల్పించిన సౌకర్యాలనే సాధారణ భక్తులకు కూడా ఈ దేవస్థానం పాలకమండలి అందిస్తోందని సాధారణ భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంత రద్దీగా ఉన్నప్పటికీ నియంత్రించేందుకు అధికార యంత్రాంగం, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో భక్తుల ఇబ్బందులను, సమస్యలను తక్షణమే గుర్తించడం ఒక మంచి విధానమని భక్తులు చెప్పుకుంటున్నారు. దేవస్థానం పాలక మండలి చేసిన ఏర్పాట్లలో మరొక అంశం కూడా ఉంది. అమ్మవారి దేవస్థానం పరిసర ప్రాంతాలు మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా నిరంతరం అమ్మవారి స్తోత్రాలు, ఓంకార మంత్రం నిరంతరం భక్తులకు వినిపించేలా చేయడం ఒక మంచి విధానమని చెబుతున్నారు. అమ్మవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు ఒక ఆధ్యాత్మిక భావనతో దర్శనం చేసుకోవాలని అప్పుడే మనసుకు ప్రశాంతత ఉంటుందని ఎంతోమంది ఆధ్యాత్మిక వాదులు చెప్పే విషయాన్ని దేవస్థానం పాలకమండలి అనుసరిస్తోందని భక్తుల అభిప్రాయంగా తెలుస్తోంది. సాధారణ భక్తులకు వీలైనంత వేగంగా దర్శన భాగ్యం కల్పించేందుకు పాలకమండలి ఏ రోజుకు ఆ రోజు సమీక్షిస్తూ మార్పులు చేయటం వల్ల భక్తులు ప్రతిరోజు సత్వరమే దర్శనం చేసుకోగలుగుతున్నారు. మరో ఐదు రోజులలో ముగియనున్న ఈ ఉత్సవాలు ఇదే క్రమశిక్షణతో నిర్వహించేందుకు పాలకమండలి నిరంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తోంది. ఈ ఉత్సవాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు, సబ్ కలెక్టర్ ఆదితి సింగ్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు నిరంతరం భక్తుల అవసరాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. భక్తులకు ఎక్కడైతే ఇబ్బంది తలెత్తుతుందో ఆ సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టడం భక్తులకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News