Breaking News

మహాద్భుతం…. అమ్మవారి ప్రసాదం….

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తున్న వేలాదిమంది భక్తులకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదానంలో భాగంగా అందిస్తున్న ఆహార పదార్థాలు అత్యంత రుచికరంగా, మహాద్భుతంగా ఉన్నాయని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిత్యాన్నదాన కేంద్రంలో భోజనం చేసి మరీ ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామరావులతో కలిసి నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. భక్తులతో మమేకమై నిత్యాన్నదాన కేంద్రంలో వసతులను, ఇబ్బందులను గురించి అడిగారు. సాధారణ భక్తులతో కలిసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్నారు. వారు చెప్పిన సమస్యలను కలెక్టర్ ఎస్. డిల్లీరావు, కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామరావుతో అక్కడికక్కడే చర్చించి భక్తులు మరింత సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా కూరలు, అన్నం ఒకే చోట భక్తులకు వడ్డించేలా ఏర్పాటు చేయడం, అదనపు ఆహారం, మంచినీరు లభించే ప్రాంతాలను సూచించేలా బోర్డు ఏర్పాటు చేయడం రేపటికల్లా పూర్తి చేయాలన్నారు. అలాగే వాతావరణంలో మార్పుల కారణంగా ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో అన్న ప్రసాద కేంద్రంలో అత్యవసరంగా ఫ్యానులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు ప్రస్తుతం నిత్యాన్నదాన కేంద్రంలో 20 నుంచి 25 వేల మంది వరకు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని, మూలా నక్షత్రం రోజున మరింత మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించేందుకు వచ్చే అవకాశాలు ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి కనకదుర్గ నగర్ లో నడుచుకుంటూ దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 70 కోట్ల రూపాయలు నిధులతో త్వరలో చేపట్టబోయే అభివృద్ధి సంబంధిత అంశాలను అధికారులకు వివరించారు. ఈ అభివృద్ధి పనుల తర్వాత ఇంద్రకీలాద్రి రాష్ట్రంలోనే అత్యంత సుందరమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల ప్రారంభానికి ముందే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒక ఆధ్యాత్మికమైన భావనతో దర్శనం చేసుకోవడం, అన్న ప్రసాదం స్వీకరించడం, ప్రసాదాల కొనుగోలు వంటి విషయాలలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తమ శాఖను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాను నగరంలోనే ఉండి నిత్యం క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారని చెప్పారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడంతోపాటు తాను ప్రతిరోజు భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే చక్కదిద్ధేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నానన్నారు. క్యూలైన్లను కూడా తాను ప్రతిరోజు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దేవాలయ పవిత్రతను కాపాడేందుకు దేవదాయ శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేవాలయంలో ప్రతిరోజు కొన్ని విభాగాలను పరిశీలిస్తామన్నారు. ప్రసాదాలు తయారీ పోటును కూడా తాను రేపు పరిశీలించమన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 70 కోట్ల రూపాయలు నిధుల విడుదల అనంతరం పనులు వేగంగా సాగాలని దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈనెల 20న ముఖ్యమంత్రి రాక శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీన దేవస్థానానికి రానున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి దేవస్థానం సందర్శించిన సందర్భంలో కూడా సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్పించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం నవంబర్ నెలలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. గత ప్రభుత్వంలో కూల్చివేసిన దేవాలయాలను పునర్నిర్మాణం చేయడం కూడా ఈ అభివృద్ధిలో ఒక భాగం అన్నారు. లడ్డు ప్రసాదం ధర పెంచకుండానే లడ్డు నాణ్యత పెంచామని గుర్తు చేశారు. అదనంగా రెండు కేజీల నెయ్యి లడ్డు ప్రసాదంలో కలిపామని పేర్కొన్నారు. ప్రత్యేక సమయాలలో వస్తే దర్శనం సులభం…. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సమయాలలో దర్శనం చేసుకునేందుకు పాలక మండల సూచించిన సమయాలలో రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉదయం 8 నుండి 10 గంటల మధ్యలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో దర్శనం కోసం వస్తే వేచి ఉండే అవసరం లేకుండా ఆలయ మర్యాదలతో త్వరితగతిన దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే ప్రత్యేక ప్రతిభావంతులు, వృద్ధుల కోసం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో పాలక మండలి అవకాశం ఇస్తుందన్నారు. భవాని మాలధారులకు
ప్రత్యేక ఏర్పాట్లు….. దసరా నవరాత్రుల తర్వాత భవాని మాలధారుల దీక్ష విరమణలు ప్రారంభమవుతాయని చెప్పారు. లక్షలాది మందిగా తరలివచ్చే భవాని మాలధారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *