తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నవంబర్1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు సంబంధిత అధికారులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ నవంబర్ 1న రేపటి ఉదయం 10 గంటలకు స్థానిక కలెక్టరేట్లో జాతీయ పతాక ఆవిష్కరణ, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పుష్పాంజలి ఉంటుందని, పోలీస్ శాఖ వారు పోలీస్ గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా అధికారులు వారి సిబ్బందితో సహా ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని, జెండా ఆవిష్కరణ అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు ప్రముఖుల సందేశం ఉంటుందని తెలిపారు. రెవెన్యూ, సమాచార శాఖ, పోలీసు శాఖ తదితర శాఖల వారు వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమ ఏర్పాట్లలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఎస్ డి సి భాస్కర్ నాయుడు డిప్యూటీ సీఈవో జడ్పీ ఆదిశేష రెడ్డి జిల్లా సాంఘిక మరియు సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య, అర్బన్ తాశిల్దార్ వెంకట రమణ, ప్రోటోకాల్ తాసిల్దార్ కుప్పయ్య, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News