-రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అట్టడుగున ఉన్న గిరిజనులకు వారి సంక్షేమ అభివృద్ధికి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ భరోసా ఇచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబును రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కలిశారు. ఇటీవల అవనిగడ్డ నియోజవర్గం మోపిదేవి మండలం, కే. కొత్తపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన మహిళలపై దాడి జరిగిన ఘటనలో రాచూరి దేవి దుర్గ, కోనేటి పద్మ, మరో మైనర్ బాలికతో కలిపి ముగ్గురు బాధితులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందజేశారు. అనంతరం కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ, గిరిజనులు అనవసర భయాన్ని విడిచిపెట్టి సమాజంలో మమేకమవుతూ ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. విద్యా సముపార్జన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. అణగారిన వర్గాల్లో ప్రతి ఇంట అక్షరజ్యోతిని వెలిగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News