-నందిగామ రామచంద్రపురం గ్రామాల వద్ద పూర్తికానున్న జాతీయ రహదారి విస్తరణ పనులు…
-జాతీయ రహదారి విస్తరణ పనులు తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆదేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ వద్ద విజయవాడ- హైదరాబాద్ 65వ నెంబర్ జాతీయ రహదారి మరియు ఎ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామాల వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్. జవహర్ రెడ్డి నిర్వహించిన సమీక్షతో తిరిగి ప్రారంభమయ్యాయి. 2017లో 65వ నెంబర్ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. 2020వ సంవత్సరంలో జాతీయ రహదారిలో రాకపోకలు అనుమతించడం జరిగింది. నందిగామ సమీపంలో హైవే బైపాస్ రోడ్డు వద్ద ఆరు వరుసల రోడ్డుగా అభివృద్ధిచేసిన జాతీయ రహదారి నందిగామ సమీపంలోని వై జంక్షన్ వద్ద సుమారు 880 మీటర్ల మేరకు మాత్రం భూసేకరణలో అడ్డంకులు ఏర్పడడంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. గతంలో వై జంక్షన్ వద్ద జాతీయ రహదారి పై వెహికల్ అండర్’ పాస్ వంతెనను నిర్మించారు. దీనికి అనుసంధాన రోడ్లు వేయవలసి ఉంది. గత రెండేళ్ల నుంచి ఈ రహదారి పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో రహదారిపై ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరగడం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది గాయాలతో క్షత్రగాత్రులయ్యారు. రహదారి మొత్తం గుంటలమయం కావడంతో ప్రయాణం నరకంగా మారింది. రైతుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఆగిపోయిన విస్తరణ పనులు జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు చొరవతో గురువారం తిరిగి ప్రారంభమయ్యాయి. అలాగే ఇబ్రహీంపట్నం జగదల్పూర్ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఎ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామం వద్ద రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయ్యాయి. 2017 లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో రామచంద్రపురం గ్రామం వద్ద 70 గృహాలను తొలగించడానికి అధికారులు మార్కింగ్ చేయడం జరిగింది. వీరిలో కొంతమంది ఇళ్లను తొలగించేందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇప్పటివరకు విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్. జవహర్ రెడ్డి జాతీయ రహదారి విస్తరణ పై జరిపిన సమీక్ష సమావేశంలో నందిగామ రామచంద్రపురం గ్రామాల వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి విస్తరణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి సూచన మేరకు ఆర్అండ్ బి సెక్రటరి పిఎస్ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ లు విస్తరణ పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. నందిగామ ప్రాంతంలో రైతులకు రామచంద్రపురగ్రామంలో నివాసితులకు ప్రభుత్వ పరంగా నిబంధన మేకు నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు సర్ది చెప్పి రెవిన్యూ పోలీస్ జాతీయ రహదారి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆయా ప్రాంతాలలో జాతీయ రహదారి విస్తరణ పనులకు చర్యలు చేపట్టారు. విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు.
Prajavartha Online Telugu News