– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-29 వ డివిజన్ 208 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజల ఆశీర్వాదమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బలమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 29 వ డివిజన్ 208 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతితో కలిసి ఆయన పాల్గొన్నారు. వి.వి.నరసరాజు రోడ్డు, కొబ్బరితోటలో విస్తృతంగా పర్యటించి.. 233 గడపలను సందర్శించారు. ప్రతి పేద కుటుంబానికి అండగా తాము ఉన్నామనే బలమైన నమ్మకాన్ని గత నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం కల్పించిందని మల్లాది విష్ణు అన్నారు. ప్రజలకు ఒక్కసారి మాటిస్తే కచ్చితంగా నెరవేర్చే ముఖ్యమంత్రి ఆనాడు దివంగత మహానేత వైఎస్సార్ అయితే.. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా దళారులు లేకుండా, అవినీతిరహిత పాలన అందిస్తుండటంతో ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అప్పులపై విపక్షాల విషప్రచారం
రాష్ట్రంలో ఓటు, సీటు లేని పార్టీలు కూడా తమపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై బీజేపీ నాయకులు పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. రాష్ట్ర అప్పుల గూర్చి మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సమాధానం చెప్పాలన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991 కోట్లు మాత్రమేనని సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ సాక్షిగా లిఖిత పూర్వక సమాధానం చెప్పినట్లు గుర్తుచేశారు. ఎఫ్ఆర్బీఎంకు లోబడే రాష్ట్ర అప్పులు ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబితాలోనూ అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పులు.. ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ ఉన్నట్లు స్పష్టమైందన్నారు. పదేపదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విమర్శలు గుప్పించే ప్రతిపక్ష నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని మల్లాది విష్ణు ప్రశ్నించారు. కనుక రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు మానుకోవాలని విపక్షాలకు సూచించారు. కార్యక్రమంలో సీడీఓ జగదీశ్వరి, నాయకులు కంభం కొండలరావు, షేక్ అక్బర్, చీమల గోవింద్, శనగశెట్టి హరిబాబు, దేవినేని సుధాకర్, పూర్ణిమ, నాగమణి, జి.వాసు, జాక్సన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News