గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి బిఎల్ఓ తప్పనిసరిగా ఓటర్ల చేర్పులు, తొలగింపుల రిజిస్టర్ మెయిన్టైన్ చేయాలని, ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో ఎన్నికల విభాగ విధుల నిర్వహణపై ఏఈఆర్ఓలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు క్షేత్ర స్థాయిలో ఓట్ల చేర్పులు, తొలగింపులకు, 17-18 ఏళ్ల ప్రోస్పెక్టివ్ వివరాలు, షెల్టర్ లెస్ ఓటర్ల వివరాలకు సంబందించిన రిజిస్టర్ తప్పనిసరిగా మెయిన్టైన్ చేయాలన్నారు. ఒక్కరికే రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నవారికి పియస్సి/డియస్సీ, ఫార్మేట్-ఏ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేయాలన్నారు. ఓటర్ల నుండి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ ద్వారా సరి చేయాలని, సదరు వివరాలను ఏఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించాలని స్పష్టం చేశారు. బిఎల్ఓలు సెలవులో ఉన్నా లేదా క్రమశిక్షణా చర్యలుకు గురై ఉన్నా వారి స్థానంలో నూతన బిఎల్ఓలను కేటాయించాలని ఎన్నికల విభాగ సూపరిండెంట్ ని ఆదేశించారు. రాజకీయ పార్టీల నుండి, ప్రజల నుండి అందిన ఫారాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా పరిష్కరించాలన్నారు. సూపర్వైజరి అధికారులు తమ పరిధిలోని బిఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల విధుల్లో ఉండాలన్నారు.
సమావేశంలో పశ్చిమ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివ జ్యోతి, ఏఈఆర్ఓలు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News