-దివ్యాంగ విద్యార్థులకు కళలు, క్రీడలు కూడా బోధించాలి
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవితా కేంద్రాల్లో, ఉన్నత పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్న ఐఈఆర్పీలకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు ‘అడాప్టివ్ ఆర్ట్ కిట్’ను సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు పంపిణీ చేశారు. శుక్రవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా జిల్లాలోని 50 మంది ప్రత్యేక ఉపాధ్యాయులకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అందించారు. ప్రత్యేక ఉపాధ్యాయుల కోసం ఎల్ఎఫ్ఈ (Leadership For Equity) బృందం రూపొందించిన 30 రకాల వస్తువులతో కూడిన ఈ కిట్ ద్వారా సమ్మిళిత విద్యలో భాగంగా బోధనా సామర్థ్యాలు మెరుగుపరచడానికి, తరగతి గదిని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందన్నారు. తద్వారా దివ్యాంగ విద్యార్థులు సాధారణ విద్యార్థులతో త్వరగా కలిసిపోగలరని అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు బోధించేటప్పుడు కళలు, క్రీడలను కూడా తమ బోధనా పద్ధతుల్లో అనుసంధానం చేసుకోవాలని ఎస్పీడీ బి.శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఈ కోఆర్డినేటర్ ఎన్.కె.అన్నపూర్ణ , ఐఈ సలహాదారు రామకమల్ తదితరులు పాల్గొన్నారు. ఐఈఆర్పీలకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు కోర్సు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.
Prajavartha Online Telugu News