-భక్త కనక దాస వారి జీవితం స్ఫూర్తి దాయకం…యువత వారి అడుగు జాడలను అలవర్చుకోవాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భక్త కనక దాసు ఒక గొప్ప భక్తుడు, తత్వవేత్త అని మహనీయుల జీవితం, వారి అడుగు జాడలు యువత అలవర్చుకోవాలి అని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు కనకదాస జయంతి కార్యక్రమాన్ని జిల్లా బి.సి. వెల్ఫేర్ శాఖ వారి ఆద్వర్యంలో ఏర్పాటు చేయగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కురువ సంఘ నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి పాల్గొని కనకదాసు చిత్ర పటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని అన్నారు. కనకదాసు సైనిక కుటుంబంలో జన్మించారని, ఒక ఒక గొప్ప సైనికుడిగా విధులు నిర్వహించారని యుద్ధంలో తనకు కలిగిన శారీరిక భాదలు, సంఘటనలు చూసిన తర్వాత మార్పు చెంది ఒక మహాకవిగా మారాడని కుల, మతాలకు అతీతంగా అందరు సమానమేనని ఎవరికైనా మోక్షాన్ని పొందే అవకాశం ఉందని, గొప్పగా చెప్పిన వ్యక్తులలో కనకదాసు గారు ప్రథమ స్థానంలో ఉన్నారని అన్నారు. కనకదాసుగారికి తిరుపతికి ఎంతో అనుబంధం ఉందని కన్నడ లో కవిగా ఉన్నపటికీ ఎక్కువ కాలం తిరుపతిలోనే ఉన్నారని అన్నారు. ఇలాంటి మహానుభావులను తమ జయంతి, వర్దంతిలలో స్మరించుకోవడం వల్ల వారి జీవితాల నుండి మనం స్ఫూర్తిని పొందుతామని అదే విధంగా వీరి జీవితాల గురించి పిల్లలకు కూడా తెలియజేయ గలిగితే వారు చిన్న వయస్సు నుండి స్పూర్తిని పొంది చైతన్య వంతులుగా ఎదుగుతారని అన్నారు. కనకదాసు తన జీవితంలో ఎంతో నిక్ఖచిగా జీవించేవారని, ఎంతో ధైర్యంతో, ప్రశ్నించే తత్వంతో ఉండేవారని అదే స్పూర్తి మనం మన పిల్లలకు నేర్పించాలని ఇలాంటి గుణాలు అందరూ అలవరచుకోవాలని అప్పుడే సమాజంలో, కుల వ్యవస్తలో మంచి మార్పు వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ తమ కులాల గురించి తెలుసుకోగలగాలని అప్పుడే తాము పొందాల్సిన హక్కులను సాధించుకోగలరని అన్నారు. డిసెంబర్ నెలలో జరగనున్న కుల గణనలో అందరు తమ ఉప కుల వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు. కుల సంఘాల లోని నాయకులు తమ కులాల వారిని చైతన్య పరచేలా సమావేశాలు నిర్వహించి అందరు ఈ కుల గణన లో పాల్గొనే చూడాలని అన్నారు. కురువ సంఘం వారు తిరుపతి నందు కనకదాస భవన నిర్మాణానికి స్థలం కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, ఇతర వినతి పత్రాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని తెలిపారు.
కలెక్టర్ ఉపన్యాసానికి ముందు కురువ సంఘ సీనియర్ సభ్యులు జయన్న మాట్లాడుతూ కనకదాసు ఒక గొప్ప కవి, పరమ భక్తుడు అని ఆయన నుండి మనం నిత్య జీవితంలో నేర్చుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని కొనియాడారు. అనంతరం సంఘ ఇతర నాయకులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బి.సి. వెల్ఫేర్ అధికారి భాస్కర్ రెడ్డి, కురువ సంఘ నాయకులు నంజుండప్ప, వెంకట నారాయణ, రమణ, రెడ్డి కుమార్, మంగిరి రెడ్డప్ప, రామచంద్ర, బిసి సంక్షేమ శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News