– డయాబెటిస్, ఎండోక్రైనాలజీ విభాగాలకు సంబంధించి అత్యున్నత స్థాయి వైద్య సదస్సు
– 25 మంది జాతీయ స్థాయి వైద్య నిపుణులకు ఆహ్వానం
– దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి మధుమేహ వ్యాధి
– ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న ప్రీ డయాబెటిస్ రోగుల సంఖ్య
– షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న స్థూలకాయం
– ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు
– డయాబ్ ఎండో కాన్ 2023 పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధుమేహం, ఎండోక్రైనాలజీ విభాగాలకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా విశ్లేషించేందుకు డయాబ్ ఎండో కాన్ 2023 సదస్సు నిర్వహిస్తున్నట్లు యలమంచి డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్, ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావు తెలిపారు. సదస్సు వివరాలను తెలియజేసేందుకు సూర్యారావుపేటలోని ఆరిజన్ ఎండోక్రైన్ సెంటర్ లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత, డయాబ్ ఎండో కాన్ 2023 పోస్టర్లను ఐఎంఏ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ చలసాని ప్రమోద్, సెక్రటరీ డాక్టర్ అక్కినేని శివరామ్ తదితరులతో కలిసి డాక్టర్ సదాశివరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఈనెల 3వ తేదీ ఆదివారం నాడు నగరంలోని నోవోటెల్ హోటల్లో డయాబ్ ఎండో కాన్ 2023 జరుగుతుందని వెల్లడించారు. డయాబెటిస్, ఎండోక్రైనాలజీ విభాగాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఈ అత్యున్నత స్థాయి వైద్య సదస్సుకు 25 మంది జాతీయ స్థాయి వైద్య నిపుణులు హాజరవుతున్నారని, దాదాపు 500 మంది వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. సదస్సులో ఆధునిక చికిత్సా విధానాలు, నవీన ఔషధాల గురించి ఈ సదస్సులో చర్చిస్తామని చెప్పారు. వివిధ అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారని.. ముఖ్యంగా, ప్రస్తుతం ఆందోళనకర సంఖ్యలో పెరుగుతున్న ప్రీ డయాబెటిస్ కేసుల గురించి విశ్లేషించడంతో పాటు, మధుమేహం బారినపడకుండా యువతను అప్రమత్తం చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం మన దేశంలో 10 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారని, మరో 13 కోట్ల మంది ప్రీ డయాబెటిస్ బారినపడ్డారని చెప్పారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో స్థూలకాయం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని, డయాబెటిస్ పేషెంట్లలో 85.2 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారని అన్నారు. మధుమేహంతో పాటు స్థూలకాయంతో బాధపడుతున్న వారిని డయాబెటిసిటీ పేషెంట్లుగా వ్యవహరిస్తున్నామని, సదరు పేషెంట్లు శరీర బరువును తగ్గించుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పారు. బరువు తగ్గితే షుగర్ వ్యాధిని తిప్పికొట్టవచ్చని డాక్టర్ సదాశివరావు తెలిపారు. సదస్సులో భాగంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పి.వి.రావుకు గోల్డ్ మెడల్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. మధుమేహం, ఎండోక్రైనాలజీలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, ఆధునిక చికిత్సా విధానాలను ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా డయాబ్ ఎండో కాన్ 2023ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సదాశివరావు పునరుద్ఘాటించారు. ఈ మీడియా సమావేశంలో ఐఎంఏ విజయవాడ అధ్యక్షుడు డాక్టర్ చలసాని ప్రమోద్, సెక్రటరీ డాక్టర్ అక్కినేని శివరామ్, వైడీఆర్ఎఫ్ ట్రస్టీ డాక్టర్ యలమంచి హిమన, సెక్రటరీ డాక్టర్ వై. ఐశ్వర్య, జాయింట్ సెక్రటరీ డాక్టర్ వై. అమూల్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News