కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు టౌన్ లోని గోదావరి నది ఒడ్డున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవతిలకుల వారి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనసమారాధనలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంగళవారం కొవ్వూరు టౌన్ లోని శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి పంచాయతన ఆలయం వద్ద ఈ వన సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గాండ్ల తెలికుల, దేవతిలకుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ సంకిన భవనీ ప్రియ హోంమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. కార్తీక మాసంలో పూజలు, వన భోజనాలతో పుణ్యఫలం దక్కుతుందని.. మన సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షింపబడతాయన్నారు. కుటుంబం, సమాజం పట్ల ప్రేమాభిమానాలు, సేవా గుణం వంటి లక్షణాలు ఇలాంటి వనసమారాధనలతో పెరుగుతాయన్నారు. తాను దేవతిలకుల కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిగా ఉంటూ.. వారికి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొవ్వూరు గోదావరి నదీ తీరాన ఒక భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని దేవతిలకుల పెద్దలు కోరగా.. హోంమంత్రి సానుకూలంగా స్పందించారు. అధికారులతో సమీక్షించి సంఘానికి అనువైన స్థలం కేటాయించడానికి తనవంతు సాయం అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, దేవతిలకుల పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News