గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడల పట్ల ఆసక్తి కల్గిన యువతకు ఆడుదాం ఆంద్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుందని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తికల వారు అందుబాటులోని వార్డ్ సచివాలయంలో పేరు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం కమిషనర్ చాంబర్ లో ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ద్వారా 15 ఏళ్ల పైబడి క్రీడల పట్ల ఆసక్తి ఉండి, అవకాశం కోసం ఎదురు చూసే వారికి రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. వాలీబాల్, కబాడీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్ విభాగాల్లో గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుండి మండల, అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
గుంటూరు నగర పరిధిలో వార్డ్ సచివాలయాల్లో అడ్మిన్, ఎడ్యుకేషన్ కార్యదర్శులు సచివాలయం పరిధిలో క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారి నుండి వివరాలు తీసుకొని ఆన్ లైన్ చేస్తున్నారని, ప్రతి సచివాలయం పరిధిలో అన్ని క్రీడాంశాలకు రిజిస్ట్రేషన్ జరిగేలా డిప్యూటీ కమిషనర్లు భాధ్యత తీసుకొని, స్థానిక ప్రజలకు అవగాహన కల్గించాలని ఆదేశించారు. అలాగే జిల్లా క్రీడా ప్రాదికార సంస్థ అధికారి సచివాలయాల వారిగా ఏ టీం ఎప్పుడు, ఎక్కడ పోటీల్లో పల్గోనాలో ఆయా గ్రౌండ్ లకు మ్యాప్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని, సదరు రిపోర్ట్ మేరకు ప్రజారోగ్య అధికారులు స్పెషల్ శానిటేషన్ చేపట్టాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు ఎంపిక చేసిన గ్రౌండ్ ల్లో క్రీడల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యువతలో క్రీడా నైపుణ్యాల ప్రదర్శనకు వేదికగా ఆడుదాం ఆంధ్రా ఉండేలా చర్యలు తీసుకుంటుందని, విధులు కేటాయించబడిన నోడల్, స్పెషల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో క్రీడల విజయవంతానికి కృషి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివజ్యోతి, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, కె.రవీంధ్ర, ఎస్.ఈ. (ఎఫ్ఏ`సి) సుందర్రామిరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ (ఎఫ్ఏసి) మధుసూదన్, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ వెంకటేశ్వరరావు, ఈఈలు, ఏసిపిలు, ఎస్ఎస్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News