విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సున్నితమైన హాస్యానికి కార్టూన్లు చిరునామాగా నిలుస్తాయని, కార్టూనిస్టు లను ఆదరించి ప్రోత్సహించాలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గుమ్మా సాంబశివ రావు అన్నారు. హాస్యానందం మాస పత్రిక ఆధ్యర్యంలో శుక్రవారం బాలోత్సవ భవనంలో కార్టూన్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ కార్టూన్లు సమాజానికి ప్రతిబింబంగా నిలుస్తాయి అన్నారు. వెయ్యి మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క కార్టూన్ ప్రకటిస్తుంది అన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ బాచి మాట్లాడుతూ త్వరలో ఆంధ్ర ప్రదేశ్ కార్టూన్ల సమాఖ్య ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ న్యాయవాది ఎలీషా మాట్లాడుతూ యువతరాన్ని కార్టూనిస్టు లుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి అన్నారు. జ్యోతిష పండితులు పాలపర్తి శ్రీకాంత శర్మ, కార్టూనిస్ట్ పద్మా దాస్, హాస్యానందం మాస పత్రిక సంపాదకులు రాము పండా కూడా సభలో పాల్గొన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ జాకీర్ ను యనమండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకట లక్ష్మీ స్మారక పురస్కారంతో సత్కరించారు. గుళ్లపల్లి అరుణ కుమారి స్మారక కార్టూన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన భాను, పద్మ, శేఖర్ లకు అతిథులు బహుమతులు అందించారు. సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ సభా నిర్వహణ చేశారు.
Prajavartha Online Telugu News