– నాస్తికోద్యమానికి గోరా అందించిన సేవలు అమూల్యం
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సానుకూలంగా ఆలోచించే ఏ వ్యక్తి అయినా దేవుడు ఉన్నాడు, లేడు అనే విషయంతో సంబంధం లేకుండా సమాజంలోని వ్యక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తారని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. భారతదేశ నాస్తికోద్యమ పితామహుడు గోపరాజు రామచంద్రరావు (గోరా) ఐదు దశాబ్దాల క్రితం 1972లో రచించిన ఆంగ్ల పుస్తకం “పాజిటివ్ అథీజం” తెలుగు అనువాదాన్ని బెంజ్ సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రంలో శుక్రవారం జరిగిన సభలో కలెక్టర్ డిల్లీరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కెలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ భారతదేశ నాస్తికోద్యమానికి గోరా ఒక గొప్ప చిరునామాగా నిలిచారన్నారు. దైవత్వం అనేది వ్యక్తులకు ఆపాదించడాన్ని వ్యతిరేకించడమే నాస్తికత్వానికి ఆలంబన అని గోరా గాఢంగా నమ్మేవారన్నారు. సమాజంలోని వ్యక్తుల ప్రయోజనాలను కాపాడలేని వారిని విగ్రహాల రూపంలో ఆరాధించడం తప్పుడు అభిప్రాయమని నమ్మిన ఎంతోమందిని ఆ రోజుల్లోనే గోరా చాలా ప్రభావితం చేశారని గుర్తు చేశారు. అంతిమంగా సంఘ ప్రయోజనాలను కాపాడటమే నాస్తికత్వానికి ఉన్న అతి పెద్ద లక్ష్యంగా ఆయన సాగించిన ఉద్యమం నేటికీ నిరాఘాటంగా కొనసాగడం, ఈ ఉద్యమాన్ని వారి కుటుంబ సభ్యులు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. సమాజంలో మనుషులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం వెతికేందుకు హేతుబద్ధంగా ఆలోచించడమే నాస్తికత్వానికి పునాది అన్నారు. హేతుబద్ధత లేకుండా ఆలోచించి సమస్య పరిష్కారం కాని పక్షంలో ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉందని నమ్మడమే ఆస్తికత్వమని దశాబ్దాల క్రితమే గోరా సమాజంలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు స్వతంత్ర భావాలతో జీవితాన్ని, ముఖ్యంగా ఆర్థిక పరంగా మన మీద మనమే ఆధారపడాలన్నదే నాస్తికత్వం ముఖ్య ఉద్దేశ్య మన్నారు. ప్రతి మానవుడు తన దైనందిన జీవితంలో చేసే పనులకు వాస్తవికతను జోడించి ఆలోచిస్తే అర్ధమౌతుందని, ఫలితం మనం చేసే పనులద్వారా జరుగుతుందని అప్పుడు దైవం దేవుడు అనే మాటలపై ఆలోచన ఉండదన్నారు.
ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు తాము దైవాంశ సంభూతులమని నమ్మించేందుకు చేసిన ఎన్నో ప్రయత్నాలను నాస్తిక వాదం తిప్పి కొట్టడం, సమాజంలో నాస్తిక వాదాన్ని పెంపొందించేందుకు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు జరుగుతున్న కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని నాస్తిక సమాజ సభ్యులకు సూచించారు. సమాజాన్ని నాస్తిక వాదం వైపు మొగ్గేలా ప్రభావితం చేసిన గత శతాబ్దపు నాస్తికవాద ఉద్దండులు త్రిపురనేని రామస్వామి, గోపీచంద్, కొడవడిగంటి కుటుంబరావు, గుడిపాటి వెంకటాచలం లాంటి ఎంతోమంది గొప్ప రచయితలు శతాబ్దాల కాలంగా చేస్తున్న ప్రయత్నాలను నేటి తరంలో కూడా మరి కొంతమంది సమాజ శ్రేయోభిలాషులు సమాజంలో నాస్తిక వాదాన్ని పెంపొందించి విజ్ఞాన సమాజం కోసం కృషిచేస్తున్నారని వివరించారు.
గోరా సిధ్ధాంతాన్ని ఆచరణ లో పెడుతూ సానుకూల నాస్తికత్వాన్ని ఆచరిస్తూ సమాజానికి సేవల ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యలు కావాలన్నారు.
జీవితం ధన్యమైంది: డా. జి.సమరం
పుస్తక అనువాద కర్త డా. జి.సమరం మాట్లాడుతూ నాస్తికత్వాన్ని జీవిత విధానంగా మలుచుకుని ఎంతో శ్రమించి గోరా పాజిటివ్ ఎథీజం పుస్తకాన్ని రచించారని ఆయన భావాలకు అద్దం పట్టేలా తెలుగులో అనువదించే అవకాశం రావడంతో జీవితం ధన్యమైందని భావిస్తున్నానన్నారు. సామాజిక సమానత్వం మనిషి స్వేచ్ఛ ఆర్థిక సామాజిక వ్యవస్థల మార్పునకు నాస్తికత్వం దోహదపడుతుందన్నారు.
ఈ కార్యక్రమం లో గోరా కుటుంబ సభ్యులు డా. మారు, జి.రష్మి , జి.నియంత , ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ళ నారాయణ రావు, ప్రముఖ నాస్తికులు నార్నే వెంకట సుబ్బయ్య, మోతుకూరి అరుణ్ కుమార్, స్వాతంత్ర సమర యోధులు మోతుకూరి వెంకటేశ్వర రావు, గోరా అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News