-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
-వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటితో చెరువులు నింపుకోవాలి
బంటుమిల్లి , కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని సముద్ర తీర ప్రాంత మండలాలైన బంటుమిల్లి, కృత్తివెన్ను గ్రామాలలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలతో సమర్ధవంతంగా నీటి సరఫరాను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
బుధవారం ఆయన వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఆ సమస్యను నివారించేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను సక్రమంగా నింపుతున్నారా లేదా అని, పంట కాలువలు, ఫిల్టర్ బెడ్లు స్థితిగతులు క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో పర్యటించారు.
తొలుత ఆయన బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో ఉన్న 16 ఎకరాల మంచినీటి సమ్మర్ స్టోరేజ్ చెరువు, ఫిల్టర్ బెడ్లను , కృత్తివెన్ను మండలం, పల్లెపాలెం గ్రామం ఉన్న 30 ఎకరాల మంచినీటి సమ్మర్ స్టోరేజ్ చెరువును, సీతనపల్లి గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. అలాగే బంటుమిల్లి కాలువను పరిశీలించారు. మంచినీటి సమస్య గూర్చి స్థానిక నాయకులు, ప్రజలను నేరుగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అడిగి పలు విషయాలు తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో అత్యధిక ప్రాంతాల్లో నీటిలో ఉప్పు సాంద్రత అధికమని, చెరువుల ద్వారా సరఫరా కాబడే తాగునీటిపై అత్యధికశాతం మంది ప్రజలు ఆధారపడతారన్నారు. వేసవిలో అత్యంత ప్రాముఖ్యమైన తాగునీటిని ఆయా చెరువులలో నింపుకొని తద్వారా నీటి ఎద్దడి బారిన పడకుండా ప్రజలను సంరక్షించుకొంటున్నట్లు తెలిపారు. కాలువల ద్వారా విడుదల కాబడిన నీరు చివరి ప్రాంతాల వరకు చేరడం లేదని, తూడు తొలగించకపోవడంతో నీటి ప్రవాహం సక్రమంగా లేదని , అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ల వద్ద ఫిల్టర్ బెడ్లు అన్నీ పాడై పోవడంతో కలుషిత నీరు సరఫరా కాబడుతున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా, పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము తన దృష్టికి ఈ సమస్యలు తీసుకువచ్చారని, దీంతో తానె స్వయంగా పరిశీలించేందుకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
నీటి సరఫరాలో ఇన్ ఫ్లో తక్కువగా ఉండటం వలన చివరి ప్రాంతాలకు నీరు తక్కువగా చేరుతున్నదన్నారు. గత వారమే నీటి సరఫరా నిలుపుదల చేయాల్సి ఉందని, కాలువ దిగువ ప్రాంతానికి నీరు తగినంతగా చేరకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని అభ్యర్ధించడంతో గురువారం వరకు విడుదల చేసినట్లు దీంతో 7 చెరువులు 50 శాతం, రెండు మండలాల్లో 80 శాతం వరకు చెరువులు తాగునీటితో నింపబడినట్లు కలెక్టర్ పి. రాజాబాబు చెప్పారు. కాలువకు నీరు మరో రెండు రోజులు సరఫరా కాబడుతుందని, తాగునీటి అవసరాల కోసం మోటార్లు సహాయంతో వేగవంతంగా నీటిని తోడుకోవాలని సూచిస్తూ, వచ్చే నెల మార్చిలో సైతం తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుందని కలెక్టర్ వివరించారు.
ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, డ్రైనేజ్ అధికారులతో ఒక సమావేశం నిర్వహించి, వేసవికి ముందే గుర్తించిన పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ఫిల్టర్ బెడ్స్ అన్ని మరమ్మతు చేయిస్తామని , ఇప్పటికే టెండర్లను ఆహ్వానించామని, త్వరలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్లతో పనులు ప్రారంభిస్తామని, వారిని ప్రోత్సాహించేందుకు ఫిల్టర్ బెడ్లకు అవసరమైన ఇసుకను వారికి ఉచితంగా ఇస్తామని, ఒక్క నెలరోజుల వ్యవధిలో ఈ పనులన్నీ పూర్తి చేయిస్తామని ప్రజలకు మంచినీరు సమస్య తీరుస్తానని కలెక్టర్ పి. రాజాబాబు భరోసా ఇచ్చారు…
ఈ పరిశీలన కార్యక్రమంలో జడ్పి సి ఈ ఓ జ్యోతిబసు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ ఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ ప్రసాద్, బంటుమిల్లి జడ్పిటీసీ మలిశెట్టి వెంకటరమణ, ఎం పి పి వెలవెల చినబాబు, కృత్తివెన్ను జడ్పిటీసీ మైలా రత్నకుమారి, సంబంధిత అధికారులు పెడన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News