మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించి ఉత్పాదకత పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి, చెరకు, వేరుశనగ, పత్తి తదితర పంటలతో పాటు మత్స్య, ఉద్యానవన, పశుసంవర్ధక రంగాలకు పెరుగుతున్న ఖర్చులకు ఆధారంగా రుణ పరిమితిని పెంచి పంట రుణాలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు.
2024-25 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్ లోని వరి పంటకు సంబంధించి ఒక ఎకరానికి రూ.42,700 ఖర్చు అవుతుండగా, రూ.83 వేల విలువైన స్థూల దిగుబడి వస్తోందని, ఆయా శాఖలు సమర్పించిన ఈ అంచనా ప్రకారం రూ.41,500 ఎకరానికి పంట రుణం అందించే విధంగా నిబంధనల ప్రకారం నిర్ణయించబడిందని బ్యాంక్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. అయితే నానాటికి పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఉన్న రుణ పరిమితిని రూ.50 వేలకు పెంచే విధంగా చూడాలని రైతుల తరఫున పి ప్రభాకర్ రావు అనే రైతు కలెక్టర్ ను కోరారు. వరితో పాటు చెరకు పంటకు రుణ పరిమితిని పెంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు. అదేవిధంగా సీసీఆర్సీ (కౌలు కార్డు) ఆధారంగా కౌలు రైతులకు రుణాలు అందించడంలో అధికారులు చొరవ చూపాలని సూచించారు.
జిల్లాలో మత్స్యకారులకు రుణ పరిమితిని నిర్ణయించేందుకు లైసెన్సు కలిగిన మత్స్యకారుల ఖర్చు వివరాలను బ్యాంక్ అధికారులకు సమర్పించాలని కలెక్టర్ మత్స శాఖాధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయ శాఖ వారి చిరుధాన్యాలతో రుచికరమైన వంద రకాల వంటలు, నాబార్డు బ్యాంకు వారి పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2023-24 పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో కేడిసిసి బ్యాంక్ సీఈవో ఎ.శ్యామ్ మనోహర్, జనరల్ మేనేజర్ బి ఎల్ చంద్రశేఖర్, డీజీఎం పి వరాలమ్మ, ఎల్ డి ఎం పియస్ జయవర్ధన్, వ్యవసాయ శాఖ అధికారిణి ఎన్ పద్మావతి, ఉద్యాన శాఖాధికారిణి జె జ్యోతి, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News