-పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జన హితానికీ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది జనసేన పార్టీ. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని…. ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో- పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలూ, సందేహాలు ఏమైనా ఉంటే నా రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావచ్చు. తద్వారా మీ ఆలోచనలు, భావోద్వేగాలు పార్టీకి చేరుతాయి. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ప్రకటనలు చేసే నాయకుల నుంచి వివరణ తీసుకోవలసిందిగా ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి స్పష్టత ఇచ్చాను. పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు. ప్రజలు స్థిరత్వాన్నికాంక్షిస్తున్నారు. ఈ సమయంలోపార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవశ్యం అని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
Prajavartha Online Telugu News