గుడ్లవల్లేరు, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు 18వ తేదీన గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో వారి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు పరిశీలించారు. శనివారం ఆయన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం జరిగే ప్రధాన వేదిక, ప్రధాన భవనం వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయా స్థలాల వద్ద పూలతో సుందరంగా తీర్చిదిద్దాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. వేదిక సమీపంలో అంబులెన్స్, అవసరమైన మందులు, ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు అతిధి గౌరవానికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా, కళాశాల చరిత్రలో చిరస్మరణీయమైన సందర్శనగా నిలిచిపోయేలా గొప్పగా ఏర్పాట్లు చేయాలని విద్యాసంస్థల యాజమాన్యానికి కలెక్టర్ సూచించారు.
గుడివాడ ఆర్డిఓ పి పద్మావతి, డీఎస్పీ పి.శ్రీకాంత్, విద్యాసంస్థల చైర్మన్ వి.నాగేశ్వరరావు, రాజ్ భవన్ ప్రోటోకాల్ ప్రత్యేక అధికారి ఎస్.పరమేశ్వరరావు, డిపిఓ నాగేశ్వర నాయక్, డిఎమ్ అండ్ హెచ్ ఓ డాక్టర్ జి.గీతాబాయి, రహదారులు భవనాల ఈఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఈఈ భాస్కర్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ బుర్ర కరుణ కుమార్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
Prajavartha Online Telugu News