-పురాతన ఆలయాలకు నూతనత్వం కల్పించాలి…
-భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసిన చినజీయర్ స్వామి…
-ఒక కోటి 40 లక్షల రూపాయలతో కోరుకొండలో శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం…
-రూ.3.80 కోట్ల రూపాయలతో కోరుకొండలో సిసి రోడ్లు,సిసి డ్రైన్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన..
-రూ.60 లక్షలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ మెట్ల మార్గం పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త ఆలయాలను నిర్మించడం కంటే ఉన్నవాటికి నూతన త్వం,కల్పించడం,పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయడం అవసరమని పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు. కోరుకొండ గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో చేపట్టిన పలు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ పాల్గొన్నారు. ముందుగా మధురపూడి ఎయిర్ పోర్ట్ నందు చిన్న జీయర్ స్వామికి ఎమ్మెల్యే రాజా ఘన స్వాగతం పలికి రోడ్డు మార్గం ద్వారా కోరుకొండ స్వగృహం చేరుకున్నారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారి చేతుల మీదుగా భక్తులకు తీర్థగోష్ఠి కార్యక్రమం చేపట్టారు. తిరుపతి తిరుమల దేవస్థానం మరియు శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలోఒక్క కోటి 40 లక్షల రూపాయలతో చేపడుతున్న శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ పునఃనిర్మాణములో భాగం గా కళాపకర్షణ,బాలలయ మహా సంప్రోక్షణ ప్రతిష్టకార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి చేతుల మీదుగా నిర్వహించారు. కోరుకొండ గ్రామ అభివృద్ధిలో భాగంగా సిసి రోడ్లు సిసి డ్రైన్లు 3కోట్ల 80 లక్షలు రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు
అనంతరం 60 లక్షలతో కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ మెట్ల మార్గం పునరుద్ధరణ పనులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కోరుకొండ ఆలయ ప్రాంగణం నందు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారిచే భక్తుల కోసం అనుగ్రహ భాషణం చేశారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి భక్తులను ఉదేశించి మాట్లాడుతూ వైష్ణవ సంప్రదాయంలో ఎంతో విశిష్టత గల ఆలయాల్లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఒకటన్నారు.ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం అభినంద నీయమని అయితే మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి జరిగేలా చూడాలని ఆయన సూచించారు ఇతిహాసిక ఆలయాలను అభివృద్ధి చేస్తే,చరిత్రకు కొత్త ఆయువు పోసినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం ద్వారా కొన్ని వేల సంవత్సరాల చరిత్రకు మళ్ళీ ప్రాణం పోసినట్లు అయిందని ఆయన విశ్లేషించారు. రామాలయ నిర్మాణం ద్వారా చరిత్ర తో అనుసంధానం ఏర్పరచ గలిగామని అన్నారు. శ్రీలంకకు వేసిన సేతువు వయస్సు 17న్నర లక్షల సంవత్సరాలుగా నాసా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు.ఇది సహజంగా ఏర్పడ్డది కాదని,మానవ నిర్మితమని తేల్చిందన్నారు. రామాలయ నిర్మాణం ద్వారా లక్షల సంవత్సరాల మానవ చరిత్ర కళ్ళముందు కదలాడుతోందన్నారు. ప్రపంచంలో ఏ మూలా అప్పటికి ఏ నాగరికత కళ్ళు తెరవాలేదన్నారు. మన చరిత్ర అంతటి ప్రాచీనమని ఆయన పేర్కొన్నారు. అందుకే కొత్త ఆలయాలు కట్టడం కన్నా పాత ఆలయాలకు వైభవం కల్పించడం ముఖ్యమన్నారు. సంస్కారం గల కుటుంబంలో పుట్టిన జక్కంపూడి రాజా ఎంతో ఉత్సాహంతో శ్రీ రంగనాథ స్వామి,శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం అభినంద నీయమని పేర్కొన్నారు.
సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఈనెల 20నుంచి మార్చి 1వ తేదీ వరకు రెండవ బ్రహ్మోత్సవాలు సమతా కుంభ్ జరపడానికి నిర్ణయం చేసారని,అక్కడికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కోరుకొండలో భగవంతుని సేవకు సంభవించిన కార్యక్రమాలు కావడంతో జక్కంపూడి రాజా ఆహ్వానం మేరకు వచ్చినట్లు ఆయన తెలిపారు.టిటిడి నిధులు, అన్నవరం సొమ్ములు ఇస్తుంటే కడుతున్నారని ఊరుకోకుండా ఈ గ్రామస్తులు అందరూ కూడా భగవంతుని సేవలో పాల్గొని,తమ తమ శక్తిని అనుసరించి భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని చినజీయర్ స్వామి అన్నారు.ఒక పూట తాగే కాఫీ ఆపితే ఆ సొమ్ముని స్వామి సేవకు ఇచ్చినా మంచిదేగా అని ఆయన అన్నారు. యువకులతో ఒక టీమ్,మహిళలతో ఒక టీమ్ ఏర్పాటుచేసి, గుమ్మం గుమ్మానికి వెళ్లి బొట్టు పెట్టి భగవత్ సేవా కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఆయన సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఇంతటి పుణ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని స్వామి వారితో కలిసి పుణ్య కార్యక్రమములో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడు తూ మానవ జీవితం క్షణభంగురమని ఏ క్షణాన ఏది జరుగుతుందో ఎవరికీ తెలియదని సమయం దొరికిన ప్పుడల్లా భగవాన్ నామస్మరణ చేయడమే జీవితంలో ముక్తి మార్గమన్నారు.
ఎంతో పురాణ ప్రసిద్ధి చెందిన కోరుకొండ లక్ష్మీనరసింహ ఆలయం నుండి కలియుగ దైవమైన తిరుమలేడుకి ఇక్కడ నుండి కల్యాణ మహోత్సవాలకి పట్టు వస్త్రాలు తలంబ్రాలు పంపించేవారిని పెద్దలు చెబుతుంటారని తిరిగి ఆ వైభవానికి శాతం అందిపుచ్చుకోవాలని ఆమె యొక్క ఆకాంక్షను వెలిబుచ్చారు.నా బిడ్డ జక్కంపూడి రాజా నిరంతరం స్వామి వారి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే తపనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ కోరుకొండ శ్రీ రంగనాథ స్వామి ఆలయ పున్న నిర్మాణం మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం స్వామి వారి అనుగ్రహంతోనే అది సాధ్యమైంది అన్నారు.
కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నవరం దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News