-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ.. పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తదితరులతో కలిసి గురువారం అమరావతి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు తదితరాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పాఠశాల విద్య, ఇంటర్మీడియెట్ అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్, మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియెట్‌కు సంబంధించి 40,082 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 35,494 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 75,576 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు. అదే విధంగా పదో తరగతి పరీక్షలకు 33,007 మంది హాజరుకానున్నారని తెలిపారు. ప్రశ్నపత్రాల తరలింపు, బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్, వైద్య శిబిరాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నామని.. హాల్ టికెట్‌తో ఉచితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈవో) సీఎస్ఎస్ఎన్ రెడ్డి, డీఎస్ఈవో యూవీ సుబ్బారావు, ఏడీ కేఎన్వీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News