– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఈసీఐ నిబంధనలు, మార్గదర్శకాల మేరకు ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న మూడు ఈవీఎంలకు అదనంగా మరో మూడు ఈవీఎంలను మంగళవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గొల్లపూడిలోని ఈవీఎం గోదాము నుంచి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఎన్నికలను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఈ క్రమంలో ప్రజలు, యువతను ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యవంతులను చేసేందుకు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు నిబంధనలను అనుసరించి ప్రస్తుతం మూడు ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. స్వీప్ కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు అధికారులకు మరిన్ని శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉన్నందున అవసరం మేరకు అదనంగా మరో మూడు ఈవీఎంలను ఈసీఐ నిబంధనల ప్రకారం అధికారులకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అప్పగించడం జరిగిందన్నారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రణాళిక ప్రకారం జన జాగృతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అదే విధంగా అధికారులకు నాణ్యమైన శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News