-సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే కసాయి బీజేపీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడ సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలలోకి వచ్చిన తరువాత దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను, పార్టీలను అడ్డగోలుగా పడేస్తుందని విమర్శించారు. గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాలను పడేసిందని, కర్నాటకలో ప్రయత్నించిందన్నారు. అమ్ఆద్మీ పార్టీ ఇంకా లొంగని కారణంగా కేజ్రీవాల్‌పై కేసులు పెట్టిందని, మనీష్ సిసోడియాను ఇంకా జైల్లోనే ఉంచిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారు అదే ప్రజాస్వామ్యంతో ఓడిపోతారని స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ, కేసీఆర్‌లు ఓడిపోవటమే దానికి నిదర్శనం అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్బీఐ తోసిపుచ్చటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే అన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ధ్వంసం చేస్తుందన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి రూ.6,500 కోట్లు వెళ్లాయని వాటి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని లూటీ చేసి విదేశాల్లో ఉన్నవారు ఎక్కువగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకుల నుంచే అప్పులు తీసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకే ఎస్బీఐ లెక్కలు చెప్పటానికి జూన్ నెల వరకు గడువు కోరిందన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ ఎవరి వద్ద నుంచి వచ్చాయి? అందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో క్రింద వారికి మోడీ సర్కార్ ఏమి ఇచ్చిందనే విషయాన్ని బహిర్గతం చేయాలన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా ఎస్బీఐ సుప్రీంకోర్టును గడువు కోరగలదా? అనే సందేహం వెలిబుచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు ఎలక్ట్రోరల్ బాండ్స్ వ్యవహారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమం ద్వారా ఆర్థిక నేర వ్యవస్థను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐ అన్ని బ్రాంచ్‌ల వద్ద ఆందోళనలు చేస్తామన్నారు.
బీజేపీ ప్రచారంలో ఎన్డీఏ గ్యారెంటీ, బీజేపీ గ్యారెంటీ, కేంద్రం గ్యారెంటీ అని కాకుండా మోదీ గ్యారెంటీ అని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నేనే రాముడ్ని, నేనే కృష్ణుడ్ని అంటూ మోదీ తనకు తాను విష్టుమూర్తి 11వ అవతారంగా ప్రకటించుకునే ప్రయత్నంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను సముద్రంలోకి వెళ్లాను కాబట్టి తానే సాహస వంతుడ్ని, ధైర్యవంతుడ్ని అని చెపుతున్నారని విమర్శించారు. సముద్రంలో శిలాశకలాలకు దండం పెట్టటం తెలివితక్కువతనమన్నారు.
బీజేపీ చేసిన పనులు చెప్పుకుని ప్రజల్ని ఓట్లు అడగలేకపోతున్నదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. తమకు అనుకూలంగా లేని పార్టీలపై ఈడీతో దాడులు చేయిస్తుందన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం సిటిజన్‌షిప్ ఎమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)ను అమలు చేయటానికి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గుతాయని తెలిసి దక్షిణ భారతదేశంలో బిజెపి ప్రచారాన్ని ముమ్మరం చేసిందన్నారు. తమిళనాడు, కేరళల్లో మోదీ ఎక్కువ సార్లు పర్యటిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. టీడీపీని నాశనం చేయటానికే బిజెపి పొత్తు పెట్టుకుందన్నారు. పొత్తు పెట్టుకుంటారా? జైల్‌కు వెళతారా? అని చంద్రబాబును భయపెట్టిందన్నారు.
తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన బీజేపీని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన టీడీపీ, వైసీపీలను కాకుండా ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండియా కూటమిని ప్రజలు ఆదరించాలని కోరారు. వామపక్షాలు, కాంగ్రెస్ కూటమితో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఆయన రక్షణను సాకుగా చూపి చెట్లు నరికేయటమేమిటని ప్రశ్నించారు.
విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదిన కాంగ్రెస్ పార్టీ విశాఖలో నిర్వహించనున్న బహిరంగ సభకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి సంఫీుభావంగా జరిగే ఆ సభలో సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటాయని చెప్పారు. అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలను రామకృష్ణ సమాధానం ఇస్తూ రాష్ట్రంలో 5 లోక్‌సభ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సీపీఐ సంసిద్ధంగా ఉందన్నారు. ఒక్కో రాష్ట్రానికి బలాబలాలు వేరువేరుగా ఉంటాయని సామర్ధ్యాన్ని బట్టి పోటీ చేయటం జరుగుతుందన్నారు. మరో వారంరోజుల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం, ఎవరు పోటీ చేస్తారు అనే స్పష్టత వస్తుందని వివరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, కెవివి ప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News