విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గారి ఆదేశాల మేరకు జిల్లా యువజన సంక్షేమ అధికారి, జిల్లా స్వీప్ నోడల్ అధికారి యు.శ్రీనివాసరావు, ఎస్ఆర్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత ఎన్నికల్లో ఓటు సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ఆవశ్యకతను సమాజానికి తెలియజేసేందుకు కృషిచేయాలని సూచించారు. వివిధ యాప్‌లపై అవగాహన పెంపొందించుకోవాలని.. ఓటు వేయడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని తెలియజేశారు. ఎస్ ఆర్ ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటును ఆయుధంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగించుకోవాలని యువతని కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రమేష్ మాట్లాడుతూ యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. విలువలతో కూడిన ఓటింగ్‌పై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాసరావు, శాంతి భాయ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News