-మున్సిపాలిటీ, మండలాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా త్రాగు నీటిని అందేలా చూడాలి
-ప్రతి 15 రోజులకు మున్సిపాలిటీ, మండలాల్లో త్రాగునీటి నిర్వహణ సమావేశం నిర్వహించాలి
-ఎండాకాలంలో త్రాగు నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపట్టాలి: తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండా కాలంలో త్రాగు నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపట్టాలి అని, కమాండ్ కంట్రోల్ రూం కు ఫిర్యాదు అందిన త్రాగునీటి సరఫరా స్కీమ్ ల మరమ్మత్తు 48 గంటల్లో, హ్యాండ్ పంప్ ల మరమ్మత్తులు 24 గంటల్లో పరిష్కరించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి త్రాగు నీటి పై సమీక్ష నిర్వహించాలని, ఉపాధి హామీ పథకం పనుల్లో ఎస్సీ ఎస్టీ కుటుంబాల కవరేజీ పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎండాకాలంలో త్రాగు నీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు, ఉపాధి హామీ పథకం కార్యక్రమం ద్వారా కూలీలకు ఉపాధి పని దినాలు కల్పించడం వంటి పలు అంశాలపై కలెక్టర్ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగు నీటి ఎద్దడి నివారణ కొరకు కంటింజెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, బోర్ల ఫ్లషింగ్, డీపెనింగ్ కొరకు 15 వ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలి అని తెలిపారు. నీటి సరఫరా సమస్యలపై జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నామని, నీటి సరఫరా స్కీమ్ ల మరమ్మత్తు ఫిర్యాదులు 48 గంటల్లో, హ్యాండ్ పంప్ ల మరమ్మత్తుల ఫిర్యాదులు 24 గంటల్లో పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మున్సిపాలిటీ, మండలాలలోని పబ్లిక్ ప్లేస్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులకే కాకుండా, పశుపక్ష్యాదులకు కూడా నీటిని అందేలా ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే మనం ప్రతి ఒక్కరూ మన ఇంటి బయట ఒక పాత్రలో నీరు పెట్టడం ద్వారా పక్షులు దాహాన్ని తీర్చిన వారు అయితామని అన్నారు. నీటిని పొదుపు చేయాలి అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మున్సిపాలిటీ, మండలాల్లో త్రాగునీటి నిర్వహణపై తాసిల్దార్లు, ఎంపిడిఓ, డి.ఈ/ఏ.ఈ ఆర్డబ్ల్యూఎస్ – కన్వీనర్, ఎలక్ట్రిసిటీ అధికారులు కలిసి సమావేశం నిర్వహించాలనీ సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలో కూడా సమన్వయ సమావేశం నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ భూమి మీద ప్రతి ప్రాణి చాలా విలువైనదే అని అన్నారు. పట్టణాలలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు పూర్తిగా నింపేలా, మల్టీ విలేజ్, హ్యాబిటేషన్ డిస్ట్రిబ్యూషన్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ ను నింపాలని, అలాగే జూన్ 31 వరకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నందు కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పించాలని, సరాసరి వేతనం మెరుగ్గా అందేలా, ఎస్సి,ఎస్టీ హ్యాబిటేషన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికా బద్ధంగా అర్హులైన అందరూ కవర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో చంద్రగిరి, తొట్టంబేడు, వాకాడు, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్, వరదయ్య పాలెం, చిన్న గొట్టిగల్లు తదితర ప్రాంతాలు ఎస్సీ,ఎస్టీ కుటుంబాల కవరేజిపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులను రేపు మధ్యాహ్నం లోపు పెండింగ్ లేకుండా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో పంచాయితీ రాజ్ శాఖ వారు ర్యాంపులు ఏర్పాటు, మరుగుదొడ్లు, పవర్ సప్లై బోర్డులు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీడబ్ల్యూడి ఓటర్ ల కొరకు ఒక వీల్ చైర్ తప్పక ఉండాలని అన్నారు. విసి హాజరు కాని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా త్రాగునీటి సరఫరా అధికారి విజయ్ కుమార్, పథక సంచాలకులు, డ్వామా శ్రీనివాస రావు, జిల్లా పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News