-దేశంలో భిన్న భాషలు భిన్న వస్త్రధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు వున్నప్పటికీ అందరిలో భారతీయతా మనస్తత్వం వుండాలి.
-న్యాయ శాస్త్రం పూర్తిచేసిన వారికి స్వేచ్ఛ సమానత్వం సామాజిక ప్రజాస్వామ్య విలువల గురించి తెలుస్తుంది : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా .జస్టిస్ డి. వై.చంద్ర చూడ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని, సామాజిక బాధ్యత కావాలని కాబోయే న్యాయవాదులను ఉద్దేశించి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డా. జస్టిస్ డి.వై. చంద్ర చూడ్ అన్నారు.
మంగళవారం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో న్యాయశాస్త్ర విభాగంలో ఐదు సంవత్సరాల కోర్సు ప్రారంభించి దశాబ్ది కాలమైన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. దాదాపు 1500 మంది పైచిలుకు విద్యార్థులకు వారు తన ఉపన్యాసం ద్వారా దిశానిర్దేశం చేశారు. న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించే ఒక మంచి ఔషధం కావాలని, సామాజిక బాధ్యత కావాలని కాబోయే న్యాయవాదులను కావాలని తెలిపారు.
గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి తన తండ్రి గారు , నాటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై. బి. చంద్రచూడ్ గారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంకి 1982 మార్చి లో వచ్చారని గుర్తు చేసుకున్నారు. గతంలో న్యాయశాస్త్ర డిగ్రీని రెండవ డిగ్రీగా చేసేవారని, ఇప్పుడు న్యాయశాస్త్ర డిగ్రీని ఏకైక డిగ్రీగా ఎంచుకుని దీక్షతో పూర్తి చేస్తున్నారని తెలిపారు. నేడు విద్యార్థినులు సగం కంటే ఎక్కువగా న్యాయశాస్త్ర విద్య చదవడం అభినందనీయమన్నారు. తాము చదివే రోజుల్లో క్లాసుకు ఒకరిద్దరు విద్యార్థినులు మాత్రమే వుండేవారన్నారు. భారత దేశంలో భిన్న భాషలు , భిన్న వస్త్రధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు వున్నప్పటికీ అందరిలో భారతీయతా మనస్తత్వం, దేశీయ భావన ఒక్కటిగానే వుంటుందని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కుటుంబానికి పెద్ద లాంటి వ్యక్తిగా అర్థం చేసుకోవాలని , కొలీజియంలో వివిధ రాష్ట్రాల, వివిధ న్యాయశాస్త్ర విభాగాల్లోనిష్ణాతులైన న్యాయమూర్తులతో వ్యవస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. తాము విశ్రాంతిగా కాఫీ తాగే సమయంలో కూడా తమ భుజ స్కంధాలపై ఎంతటి బాధ్యతలు వున్నాయో గుర్తు చేసుకుంటూ వుంటామని అన్నారు. తమకు న్యాయ విద్యను నేర్పించిన గురువుల మేధస్సు అసాధారణమైనదని, వారు అపార జ్ఞానాన్ని తనకు పెంచడం వల్ల తాను ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో వున్నానని గుర్తుచేసుకుంటూ ,విద్యార్థులకు గురువుల విశిష్టతను వివరించారు. నేషనల్ లా యూనివర్సిటీ లలో చదివినవారు మాత్రమే గొప్పగా రాణిస్తారని అనుకోవడం నిజం కాదని, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివినా కృషితో మంచి న్యాయాన్ని సమాజానికి అందించవచ్చునని తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం 70 సంవత్సరాల పయనంలో ఏన్నో మైలురాళ్ళు చేరుకుందని, నేడు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రెండవ స్థానంలో వుందని తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. సైన్స్ , కృత్రిమ మేధ రంగాల్లో నూతన కోర్సులు ప్రారంభించిందని తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మనాభం మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల న్యాయశాస్త్ర కోర్సు డీన్ ఆచార్య వి. ఆర్.సి.కృష్ణయ్య లా కోర్సు నిర్వహిస్తున్న విధి విధానాలను గురించి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి, రిజిస్టర్ రజిని, జిల్లా న్యాయాధి కారులు, న్యాయశాస్త్ర విభాగ అధ్యాపకులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News