Breaking News

ఎన్నిక‌లను స‌జావుగా నిర్వ‌హించ‌డంలో మీడియా పాత్ర కీల‌కం

– ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా మీడియా సెంట‌ర్ ఏర్పాటు
– రాష్ట్రంలోనే అత్య‌ధికంగా జిల్లాలో రూ. 3.68 కోట్ల విలువైన సీజ‌ర్లు
– సీ విజిల్‌తో పాటు వివిధ మార్గాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ఆయువుప‌ట్టు అయిన ఎన్నిక‌లను స్వేచ్ఛాయుత, నిష్ప‌క్ష‌పాత వాతావ‌ర‌ణంలో పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌డంలో మీడియా పాత్ర కీల‌క‌మ‌ని.. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన మీడియా సెంట‌ర్ ద్వారా ఎన్నిక‌ల స‌మాచారాన్ని అధికారికంగా అందించ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు అన్నారు.
న‌గ‌రంలోని స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంగ‌ణంలోని జిల్లా సమాచార‌, పౌర సంబంధాల శాఖ కార్యాల‌యంలో జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. సమాచార‌, పౌర సంబంధాల శాఖ క‌మిష‌న‌ర్ టి.విజ‌య్ కుమార్‌రెడ్డి, పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌తో క‌లిసి మీడియా సెంట‌ర్‌ను ప్రారంభించారు. ఈ సెంట‌ర్‌లో మీడియా ప్ర‌తినిధుల‌కు క‌ల్పించిన సౌక‌ర్యాలు; పార్ల‌మెంటు, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా గ‌త ఎన్నిక‌లు, ప్ర‌స్తుతం ఓట‌ర్ల వివ‌రాలు, ఈపీ రేషియో, పోలింగ్ స్టేష‌న్లు, కౌంటింగ్ కేంద్రాలు త‌దిత‌రాల‌కు సంబంధించి ప్ర‌ద‌ర్శించిన స‌మాచారాన్ని, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించి వివిధ మార్గ‌ద‌ర్శ‌కాలు, నిబంధ‌న‌లతో ఈసీఐ రూపొందించిన హ్యాండ్ బుక్స్ స్టాల్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ షెడ్యూల్ ప్ర‌కారం మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంద‌ని.. పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజున‌, పోలింగ్ త‌ర్వాత ఈ మూడు ద‌శ‌ల‌కు సంబంధించి జిల్లావ్యాప్త ఎన్నిక‌ల స‌మాచారాన్ని మంచి వాతావ‌ర‌ణంలో, చ‌క్క‌టి ఏర్పాట్ల‌తో కూడిన మీడియా సెంట‌ర్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. సిస్ట‌మాటిక్ వోట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ ఎల‌క్టోర‌ల్ పార్టిసిపేష‌న్ (స్వీప్‌) కార్య‌క్ర‌మాల స‌మాచారాన్ని కూడా అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ మీడియా సెంట‌ర్ ఆధ్వ‌ర్యంలో మీడియా స‌మావేశాలు కూడా జ‌రగ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు.

రాష్ట్రంలోనే అత్య‌ధికంగా రూ. 3.68 కోట్ల విలువైన సీజ‌ర్లు:
ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్య‌ధికంగా రూ. 3.68 కోట్ల న‌గ‌దు, మ‌ద్యం, విలువైన లోహాలు త‌దిత‌రాల సీజ‌ర్లు జ‌రిగిన‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. ఇందులో ఒక్క న‌గ‌దే రూ. 1.48 కోట్ల మేర ఉన్న‌ట్లు తెలిపారు. గ‌రిక‌పాడుతో పాటు 11 కీల‌క పాయింట్ల‌లో ప‌టిష్ట నిఘా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఫ్ల‌యింగ్ స్క్వాడ్స్‌, స్టాటిక్ స‌ర్వైలైన్స్ టీమ్స్ క్రియాశీలంగా ప‌నిచేస్తున్నాయ‌న్నారు. క‌లెక్ట‌రేట్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం, ఓట‌ర్ హెల్ప్‌లైన్ 1950, సీ విజిల్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీసెస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ) త‌దిత‌రాల ద్వారా వ‌స్తున్న ఫిర్యాదుల‌ను స‌త్వ‌రం ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 85 శాతం ఓటింగ్ న‌మోద‌య్యేలా స్వీప్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు కూడా కొత్త‌గా ఓటు న‌మోదుచేసుకునేందుకు వీలుక‌ల్పించే ఫారం-6ల‌ను స్వీక‌రించి, ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. మీడియా స‌హ‌కారంతో ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు.

మీడియా రిపోర్టింగ్‌లో క‌చ్చిత‌త్వానికి ప్రాధాన్య‌మివ్వాలి: సీపీ కాంతిరాణా టాటా
పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతిరాణా టాటా మాట్లాడుతూ మంచి ఏర్పాట్ల‌తో మీడియా సెంట‌ర్‌ను ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని.. ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు సంబంధించి అందుబాటులో ఉంచిన పుస్త‌కాలను మీడియా రిఫ‌రెన్స్‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. సెన్సేష‌న్‌కు ప్రాధాన్య‌మివ్వ‌కుండా క‌చ్చిత‌మైన స‌మాచారాన్ని ప్ర‌చురించ‌డం లేదా ప్ర‌సారం చేయ‌డం ముఖ్య‌మ‌ని.. ఏదైనా అంశానికి సంబంధించిన స‌మాచారాన్ని ప్ర‌చురించ‌డానికి ముందు సంబంధిత అధికారుల‌ను సంప్ర‌దించి స‌రిచూసుకోవ‌డం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని పేర్కొన్నారు. జిల్లాలోని బోర్డ‌ర్ చెక్‌పోస్టుల‌ను, వివిధ పోలింగ్ స్టేష‌న్ల‌ను, డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్లు, కౌంటింగ్ కేంద్రాల‌ను క‌లెక్ట‌ర్ గారు, జేసీ గారు త‌దిత‌రుల‌తో క‌లిసి ప‌రిశీలించ‌డం జ‌రిగిందని.. ఎన్నిక‌ల‌ను శాంతియుత వాతావ‌ర‌ణంలో విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో మీడియా స‌హ‌కారం ముఖ్య‌మ‌ని సీపీ కాంతిరాణా టాటా పేర్కొన్నారు.

అందుబాటులో స‌మాచార నిధి: జేసీ డా. పి.సంప‌త్ కుమార్‌
ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను స‌రైన విధంగా, స‌మ‌ర్థ‌వంతంగా క‌వ‌రేజ్ చేసేందుకు వీలుగా మీడియాకు స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు జిల్లాస్థాయి మీడియా సెంట‌ర్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ అన్నారు. ఈ సెంట‌ర్‌లో మంచి స‌మాచార నిధి అందుబాటులో ఉంద‌ని.. ఈ స‌మాచారాన్ని ఫ‌ల‌ప్ర‌దంగా ఉప‌యోగించుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అందుబాటులో ఉంద‌ని.. మీడియా ఎన్నిక‌ల వార్త‌ల ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సారం స‌మ‌యంలో ఒక‌సారి స‌మాచారాన్ని స‌రిచూసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్‌ సూచించారు.

అందుబాటులో ఉంటాం: విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌
ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాలు, నిబంధ‌న‌ల‌తో పాటు స్థానికంగా మునిసిప‌ల్ చ‌ట్టాలు, నిబంధ‌న‌లు కూడా అమ‌ల్లో ఉంటాయ‌ని.. క‌చ్చిత‌త్వంతో స‌రైన విధంగా ఎన్నిక‌ల వార్త‌ల ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సారం వ‌ల్ల ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ఎన్నిక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంలో కీల‌క భాగ‌స్వామ్యం అందించ‌వ‌చ్చ‌న్నారు. స‌మాచారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామ‌ని క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ తెలిపారు.
కార్య‌క్ర‌మంలో డీఐపీఆర్‌వో యు.సురేంద్ర‌నాథ్‌, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహ‌న‌రావు, అడిష‌న‌ల్ పీఆర్‌వో కె.ర‌వి, ప‌బ్లిసిటీ స‌హాయ‌కులు వీవీ ప్ర‌సాద్‌, ఏవీఎస్ సాయిబాబా, కార్యాల‌య అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *