– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనివేళలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేసేలా మార్పులు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాలు ఈ నెల 4వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయని.. మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలను ఇంటికి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు మే 1 నుంచి 15వ తేదీ వరకు, అంగన్వాడీ సహాయకులకు మే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. సదరు కాలంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు అంగన్వాడీల ద్వారా లబ్దిదారులకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ పంపిణీలో అంతరాయం లేకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పిల్లలకు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. అవసరమైన మేరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను, తాగునీరు తదితరాలను అందుబాటులో ఉండేలా చూడాలని.. ఈ కార్యకలాపాలను జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి జి.ఉమాదేవి పర్యవేక్షిస్తారని ఆయన ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News