Breaking News

చంద్రబాబు, నారా లోకేష్, సూర్యనారాయణలపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు శనివారం వెలగపూడి సచివాలయం నందు అడిషనల్ సీఈవో హరీంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. ప్రభుత్వం ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినా.. తీరు మాత్రం మారలేదన్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉద్యోగస్తులను రెచ్చగొట్టేలా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. కనుక సూర్యనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవలసిందిగా ఈసీని కోరినట్లు చెప్పారు.

హింసను ప్రేరేపించేలా చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలు
రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా చంద్రబాబు, నారా లోకేష్ ల ప్రసంగాలు ఉన్నాయని మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యంగా బహిరంగ సభలలో లోకేష్ వ్యాఖ్యలు కార్యకర్తలను దాడులకు ఉసిగొల్పేలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఎక్కువ కేసులు ఉన్న కార్యకర్తలకు అంతపెద్ద నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ ఆశచూపేలా ఆయన మాట్లాడారని.. లోకేష్ మాటలు చివరకు మంగళగిరిలో వైసీపీ నేత వెంకటరెడ్డి హత్యకు దారితీసిందని ఆరోపించారు. ఈ ఘటన పూర్తిగా లోకేష్ కనుసన్నలలోనే జరిగిందని విమర్శించారు. లోకేష్ కి రెండోసారి ఓటమి భయం పట్టుకుందని.. కనుకనే హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తున్నారన్నారు. మంగళగిరిలో పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అలాగే విజయవాడ నగరంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రిపై రాయి దాడికి కూడా తెలుగుదేశం నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని మల్లాది విష్ణు అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులపై దాడులకు తెగబడేలా.. తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రం వేరు, కుప్పం వేరా..?
చంద్రబాబుకి విలువలు, విశ్వసనీయత అంటూ లేవని మల్లాది విష్ణు విమర్శించారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే బాబుకి ఎదుటి మనిషిని గౌరవించడం ఏమాత్రం తెలియదన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నటప్పటికీ.. ప్రతి సభలోనూ ముఖ్యమంత్రిని అవహేళన చేస్తూ దారుణంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 19న రాయదుర్గం, ఆలూరు సభలలో జగన్ ను పాతిపెట్టాలి, సమాధి చేయాలంటూ తాపీ మేస్త్రులను ఉద్దేశించి రెచ్చగొట్టే ధోరణిలో ఆయన వ్యాఖ్యలు చేశారన్నారు. చెత్త మనుషులు, చీప్ లిక్కర్ అంటూ అమర్యాదగా మాట్లాడారన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదును అందించినట్లు తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్ మద్యనిషేధం విధిస్తే.. ఏరులై పారించిన చంద్రబాబు కూడా మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. బీర్ ను హెల్త్ డ్రింక్ చేస్తామని, మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తామన్న బాబు కూడా ఈ ప్రభుత్వంపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 14 ఏళ్ల బాబు ముఖ్యమంత్రి అనుభవం కుప్పంకే ఉపయోగపడలేదని ఎద్దేవా చేశారు. కనుకనే ఓటమి భయంతో కుప్పానికి ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించారన్నారు. రాష్ట్రం వేరు..? కుప్పం వేరా..? అని సూటిగా ప్రశ్నించారు. మరోవైపు జూన్ 4 తర్వాత మీ సంగతి చూస్తామంటూ అధికారులను తెలుగుదేశం నేతలు బెదరించడాన్ని మల్లాది విష్ణు తప్పుబట్టారు. గతంలోనూ రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నానంటూ లోకేష్ ఇదే తీరున వ్యవహరించారని గుర్తుచేశారు. మీ తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరూ భయపడరని తేల్చిచెప్పారు. జూన్‌ 4 తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమ‌ని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రావెల కిషోర్ బాబు, అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *