– విలక్షణమైన పనితీరుతో అధికారులను మెప్పించారు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార, పౌర సంబంధాల శాఖలో ప్రచార సహాయకులు, ఆడియో విజువల్ సూపర్‌వైజర్‌గా 33 ఏళ్ల పాటు సేవలందించిన ఆగం సాయిబాబా సేవలు అభినందనీయమని.. విలక్షణమైన పనితీరుతో ఆయన అధికారులను మెప్పించారని కలెక్టర్ ఎస్.డిల్లీరావు పేర్కొన్నారు.
ఎన్‌టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఆడియో విజువల్ సూపర్‌వైజర్ (ఏవీఎస్)గా పనిచేసి మంగళవారం పదవీ విరమణ చేసిన ఆగం సాయిబాబాను బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డిల్లీరావు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వారు సరైన విధంగా సద్వినియోగం చేసుకునేలా చేసే బృహత్తర కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కీలకపాత్ర పోషిస్తోందని.. అలాంటి శాఖలో తనదైన శైలిలో విధులు నిర్వర్తించి.. శాఖకు మంచి పేరు తీసుకొచ్చేలా సాయిబాబా పనిచేశారన్నారు. ఛాయాచిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో ఆయన మంచి ప్రతిభ కనబరిచారని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, డీపీఆర్‌వో ఎస్‌వీ మోహన్‌రావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, పబ్లిసిటీ సహాయకులు వీవీ ప్రసాద్, జిల్లా సమాచార శాఖ ఉద్యోగులు, సిబ్బంది హాజరయ్యారు.
Prajavartha Online Telugu News