Breaking News

మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చ‌రిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన అందిస్తోన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 23వ డివిజన్ డోర్నకల్ రోడ్డు, తాడేపల్లి వారి వీధి, పీసపాటి వారి వీధులలో సోమవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో కలిసి గడప గడపకు వెళ్లారు. కూలీలు, వర్తక వ్యాపారస్తులు ఇలా ప్రతిఒక్కరినీ పేరు పేరునా ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ ముందుకు సాగారు. 23వ డివిజన్ అంటేనే వ్యాపార సముదాయాలకు కేంద్ర బిందువని.. అటువంటి ప్రాంత అభివృద్ధిని గత తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మల్లాది విష్ణు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీవినీ ఎరుగని రీతిలో ప్రాంత రూపురేఖలు మార్చడం జరిగిందన్నారు. వ్యాపారస్తులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తూ.. ఈ ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. కోవిద్ కష్ట కాలంలోనూ వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు.

ప్రాంత సమగ్రాభివృద్ధికి విశేష కృషి
తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించే డివిజన్లను పూర్తి నిర్లక్ష్యానికి గురిచేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ ఈ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు వివరించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓ మోడల్ డివిజన్ గా రూపుదిద్దుకుందన్నారు. చుండూరు వెంకటరెడ్డి మున్సిపల్ హైస్కూల్ నందు రూ. 1.50 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులతో 10 అదనపు తరగతి గదులను నిర్మించుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. కర్నాటి రామ్మోహన్ రావు స్కూల్ ను సైతం ఆధునికీకరించినట్లు తెలిపారు. గోవిందరాజులనాయుడు వీధి, విష్ణువర్థన్ రావు వీధి, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, నరసింహనాయుడు వీధి, రాజగోపాలచారి స్ట్రీట్, శివాలయం రోడ్డు, కలెక్టర్ బంగ్లా రోడ్డు, గవర్నర్ బంగ్లా రోడ్డు సహా 16 ప్రధాన రహదారులను నూతనంగా నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రజారవాణా వ్యవస్థ ఎంతగానో మెరుగుపడిందన్నారు. అలాగే ఈట్ స్ట్రీట్, బీసెంట్ రోడ్డు సుందరీకరణతో ఈ ప్రాంతం నూతన శోభను సంతరించుకుందన్నారు. రూ. కోటి నిధులతో రాఘవయ్య పార్కు., రూ. 35 లక్షలతో లెనిన్ సెంటర్ పార్కును అభివృద్ధి పరిచినట్లు వివరించారు. కనుకనే ఐదేళ్ల వ్యవధిలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో గట్టి నమ్మకం ఏర్పడిందని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.

ఐదేళ్లలో అక్షరాల రూ. 13.85 కోట్ల సంక్షేమం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా డివిజన్లో ప్రతి నెలా 399 మందికి ఇంటి వద్దకే ఠంఛన్ గా పింఛన్ అందజేయడం జరుగుతోందని మల్లాది విష్ణు తెలిపారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 448 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 1.51 కోట్లు., అమ్మఒడి పథకం ద్వారా 405 మంది తల్లులకు రూ. 1.19 కోట్లు., చేదోడు ద్వారా 37 మందికి రూ. 7.40 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 84 మందికి రూ. 21 లక్షలు., జగనన్న విద్యాదీవెన ద్వారా 320 మందికి రూ. 1.09 కోట్లు., వసతి దీవెన ద్వారా 294 మందికి రూ. 34 లక్షలు., కాపు నేస్తం ద్వారా 44 మందికి రూ. 14.85 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 616 మందికి రూ. 20.99 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 356 మందికి రూ. 2.42 కోట్ల సంక్షేమాన్ని డివిజన్ ప్రజలకు అందజేసినట్లు చెప్పారు.

పేదల బిడ్డలు ఇంగ్లీష్‌ మీడియం చదువుకోకూడదా?
పేదల బిడ్డలు ఇంగ్లీష్‌ మీడియం చదువుకుంటుంటే కూటమి నేతలకు ఎందుకంత కడుపు మంట అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. తెలుగు భాషను చంపేస్తున్నట్లు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. పేదలకు ఉన్నత విద్యను అందించాలని సీఎం జగన్‌ తపన పడుతుంటే.. ఉనికి కాపాడుకోవడానికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. కనీసం ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఉన్న అవగాహన కూడా కూటమి నేతలకు లేకపోవడం శోచనీయమన్నారు.

అమిత్ షా కుటుంబంపై దాడిని మరిచారా..?
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, అరాచక పాలన సాగిందని మల్లాది విష్ణు విమర్శించారు. మే 11, 2018 న తిరుపతిలో అమిత్ షా పై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన అమిత్ షా కాన్వాయ్ ను వెంబడించి మరీ ఆనాడు టీడీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడికి చంద్రబాబే బాధ్యత వహించాలని ఆనాడు మాట్లాడిన బీజేపీ ప్రతినిధులు.. మరలా ఏముఖం పెట్టుకుని బాబుతో కలిసి ఎన్నికలకు వెళుతున్నారని ప్రశ్నించారు. బాబు అవినీతిపై ఆనాడు మోదీ సైతం మాట్లాడలేదా..? సమాధానం చెప్పాలన్నారు. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం టేక్ ఓవర్ చేసి, ఒక ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని అనేక సందర్భాలలో విమర్శించినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు.

చంద్రబాబు అంటేనే మోసం, దగా, కుట్ర, వంచన
చంద్రబాబు అంటేనే మోసం, దగా, కుట్ర, వంచన అని మల్లాది విష్ణు విమర్శించారు. సీఎం జగన్ సభలకు వస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి ఓర్వలేక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములకు సంపూర్ణ భద్రత కల్పించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వక్రీకరించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే భూములు లాక్కుంటారని తెలుగుదేశం చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఎన్నికల సంఘం కొరడా ఝులిపించిందని మల్లాది విష్ణు తెలిపారు. తప్పుడు వార్తలతో రైతులను, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఐడీని ఆదేశించిందన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ పన్నాగం ప్రకారమే కుట్రకు తెరదీసినట్లు నిర్ధారించిన సీఐడీ.. ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేష్ పేర్లను చేర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అలాగే చంద్రబాబు బోగస్‌ వాగ్ధానాలను ప్రజలెవ్వరూ నమ్మడం లేదని మల్లాది విష్ణు అన్నారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆత్మకూరు సుబ్బారావు, ఒగ్గు విక్కీ, చల్లా సుధాకర్, శేషన్ మురళి, వెన్నం రత్నారావు, శివారెడ్డి, పసుమర్తి రాజేష్, రామ్ పీఎస్ఆర్, పండు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *