Breaking News

మా లక్ష్యం 175/175

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుట్రలతో ఎన్ని కూటములు కట్టినా.. ప్రజల చల్లని దీవెనలతో 175 స్థానాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 1వ డివిజన్ గుణదల షిర్డీసాయి నగర్లో బుధవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ ఉద్ధంటి సునీత, నాయకులు కొండా మహేశ్వర్ రెడ్డి, వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం హయాంలో అవినీతి, మోసాలు మాత్రమే ఉండేవని.. కానీ ఈ ప్రభుత్వం సంక్షేమం, సాధికారత దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ఐదేళ్లలో అక్షరాల రూ. 47.35 కోట్ల సంక్షేమం
కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేలా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. పిల్లలకు అమ్మఒడి నుంచి అవ్వాతాతలకు పింఛన్ వరకు అన్ని వయస్సుల వారికి అండగా నిలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. డివిజన్లో వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా ప్రతి నెలా 1,916 మందికి ఇంటి వద్దకే ఠంఛన్ గా పింఛన్ అందజేయడం జరుగుతోందన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 2,166 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 6.02 కోట్లు., అమ్మఒడి పథకం ద్వారా 1,794 మంది తల్లులకు రూ. 5.69 కోట్లు., చేదోడు ద్వారా 152 మందికి రూ. 31.60 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 100 మందికి రూ. 24 లక్షలు., జగనన్న విద్యాదీవెన ద్వారా 967 మందికి రూ. 2.66 కోట్లు., వసతి దీవెన ద్వారా 867 మందికి రూ. 94.32 లక్షలు., కాపు నేస్తం ద్వారా 266 మందికి రూ. 91.95 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 2,830 మందికి రూ. 1.10 కోట్లు., వైఎస్సార్ చేయూత ద్వారా 754 మందికి రూ. 2.99 కోట్ల సంక్షేమాన్ని డివిజన్ ప్రజలకు అందజేసినట్లు చెప్పారు. ఆ పథకాలకు పేర్లు మార్చినంత మాత్రాన చంద్రబాబుకు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు గ్రహించాలన్నారు.

గుణదల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం గుణదల ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యానికి గురిచేసిందని మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చిందన్నారు. ప్రధానంగా ప్రశాంత్ కాలనీ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు రూ. కోటి 27 లక్షలతో రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. హనుమాన్ నగర్లో రూ. 25.29 లక్షలతో రోడ్లను నిర్మించడంతో పాటు రూ. 18 లక్షలతో టీచర్స్ కాలనీ రోడ్డు., రూ. 20 లక్షలతో ఆదర్శ్ కాలనీ రోడ్డు., రూ. 13.97 లక్షలతో బృందావన్ కాలనీ రోడ్డు., రూ.14.50 లక్షలతో పృథ్వి ఎంక్లేవ్ రోడ్డును నిర్మించినట్లు చెప్పారు. ప్రజల అవసరాల దృష్ట్యా.. బుడమేరుపై ఐరన్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రామకృష్ణాపురం నుంచి వచ్చు వాహనాలు దావుబుచ్చయ్యకాలనీ మీదుగా నేరుగా ఇన్నర్ రింగ్ రోడ్డును చేరుకునే విధంగా రహదారులను మెరుగుపర్చడం జరిగిందన్నారు. ఆర్.ఓ.బి.కి సంబంధించి ఇప్పటికే రూ. 12.50 కోట్ల నిధులతో భూసేకరణను పూర్తిచేసినట్లు మల్లాది విష్ణు చెప్పారు. సర్వే కూడా పూర్తికాగా.. మరో 2, 3 నెలల్లో పనులు ప్రారంభం అవుతాయన్నారు. అలాగే ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా రూ.16.63 లక్షలతో ఈ ప్రాంతంలో మూడు పవర్ బోర్లను ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు. సుమారు 30 వేల మంది జనాభాకు సరిపడా గుణదలలో రూ.32.59 కోట్ల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ లైన్ పనులకు ఇటీవల భూమిపూజ చేసుకోగా.. పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే గుణదల, పాయకాపురం, అజిత్ సింగ్ నగర్ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం రూ. 84.73 కోట్లతో వాంబేకాలనీలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మించనున్నట్లు చెప్పారు. కనుక కూటమి నేతలు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా.. చంద్రబాబుకు మరో అవకాశం ఇవ్వటానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరన్నారు. 2009 లో ఏవిధంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి పాలనపగ్గాలు చేపట్టారో.. అంతకు మించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలలో విజయదుందుభి మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆళ్ల ప్రసాద్ రెడ్డి, ఉద్ధంటి సురేష్, కొలకలేటి రమణి, మండాది వెంకట్రావు, వేణు, మురళి, నాగరాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *