మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. బుధవారం సాయంత్రం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, పోర్టు, రెవెన్యూ అధికారులతో పోర్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని అక్కడ జరుగుతున్న పురోగతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రెడ్జింగ్, బ్రేక్ వాటర్, బెర్త్ నిర్మాణ ప్రాంతాలకు చేరుకుని పురోగతి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తొలిత ఆయన రోడ్ కం రైలు మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులతో పాటు ఆ మార్గంలోని భూ సమస్య ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ కోర్టు వివాదంలో ఉన్న స్థలాలకు సమస్య పరిష్కారం అయ్యిందని, మిగిలిన అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అసైన్డ్ భూములకు సంబంధించి హక్కుదారులను గుర్తించాలని, సరైన పత్రాలను సమర్పించిన వారికి నష్టపరిహారం చెల్లింపునకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. భూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని, ఈ నేపథ్యంలో పోర్టు నిర్మాణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పోర్టు అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై విద్యాశంకర్, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ తులసీదాస్, రైట్స్ టీం లీడర్ విశ్వనాథం, బందరు ఆర్డిఓ ఎం వాణి, తహసిల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News