అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో జవాబుదారీగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం అవనిగడ్డలో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, జిల్లా అధికారులతో తాసిల్దారు కార్యాలయం సమావేశ మందిరంలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి, డ్వామా, జల వనరులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్డబ్ల్యూఎస్, టూరిజం తదితర శాఖల ప్రగతి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లా అధికారులు తమ పరిధిలో పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు జవాబు దారి వహించవలసి ఉంటుందన్నారు. వివిధ శాఖల పురోగతిపై పక్షం రోజులకోసారి సమీక్షిస్తామన్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు మంజూరైన పనులు, టెండర్లు పిలిచినవి, చేపట్టినవి పురోగతిలో ఉన్నవి, పూర్తిచేసినవాటి వివరాలతో చెల్లింపులు జరిపిన విషయాలపై దశలవారి పురోగతి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, నియోజకవర్గాల వారిగా సమగ్ర నివేదికలు సమర్పించాలన్నారు.
అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ జవాబుదారిగా, పారదర్శకంగా, చట్టబద్ధ పరిపాలనకు అధికారులు సహకరించాలని అన్నారు. సామాన్యుడు వెళ్లినా కార్యాలయాల్లో పనులు జరగాలని, అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని సూచిస్తూ, పనులు జరగకపోతే వారు నా వద్దకు వచ్చే పరిస్థితులు కల్పించవద్దని సున్నితంగా హెచ్చరించారు. గత 5 ఏళ్లలో యదేచ్చగా చట్టాల ఉల్లంఘన జరిగిందని అన్నారు. నియోజకవర్గం లో సి ఆర్ జెడ్ ప్రాంతం ఉందని, ఈ పరిధిలో సంబంధిత చట్టాలు అమలు జరిగేలా చూడాలని, ఇసుక మట్టి నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వవచ్చని, అతిక్రమించితే నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగరాదని, ధర్మో రక్షతి రక్షితః చట్టాన్ని సంరక్షించాలని అధికారులకు ఉద్బోధించారు.
అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమని, అతివృష్టి అనావృష్టి పరిస్థితులలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోడూరు మండలంలో కాలువలు డ్రైనేజీలు సరైన నిర్వహణ లేక పొలాలు ముంపు బారిన పడుతున్నాయని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో రైతుల సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళగానే డ్రైనేజీలలో గుర్రపుడెక్క తూడు తొలగించే పనులు చేపట్టుటకు చర్యలు తీసుకున్నారని, వెంటనే స్పందించిన కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. దివి సీమలో కాలువ శివారు భూములకు సాగునీరు ఇవ్వలేకపోతున్నామని, ఈ ఏడాది రైతులకు మేలు చేసే విధంగా సాగునీరు తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉందని, కావున అందుకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన చేయాలన్నారు. జూలైలో వనమహోత్సవం నిర్వహించి అవనిగడ్డ నియోజకవర్గంలో కరకట్టల వెంబడి పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రణాళిక రూపొందించాలన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, బందరు ఇంచార్జ్ ఆర్డీవో శ్రీదేవి, జిల్లా ముఖ్య గణాంక అధికారి గణేష్, అవనిగడ్డ నియోజకవర్గం ప్రత్యేక అధికారి డిఇఓ తాహరా సుల్తానా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News