-పైప్ లైన్ లీకేజీలు గుర్తిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి
-కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జూలై 1 నుంచి చేపట్టిన స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పటిష్టవంతంగా నిర్వహించాలని, జిల్లాలో ఎక్కడా డయేరియా కేసులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లు, వైద్య, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఐసిడిఎస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి డయేరియా నియంత్రణ కార్యక్రమం స్టాప్ డయేరియా నిర్వహణపై సమీక్షించారు.
జిల్లాలో మున్సిపాలిటీల్లో వార్డు సచివాలయం ఎమినిటీస్ సెక్రటరీలు, గ్రామాల్లో వార్డు సచివాలయంలోని ఇంజనీర్ అసిస్టెంట్లు వారి పరిధిలోని పైపులైనులన్నీ తనిఖీ చేశారని, గుర్తించిన లీకేజీలు అరికట్టి సర్టిఫికెట్ లు సమర్పించారని అధికారులు తెలుపగా, కలెక్టర్ వాటిని స్వయంగా ఈ సమావేశంలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామాల్లో/ పట్టణాల్లో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులు రెగ్యులర్గా తనిఖీ చేసి, క్లీనింగ్ చర్యలు చేపట్టడంతో పాటు, క్లోరినేషన్ చేయాలని, అదేవిధంగా తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకు క్లీనింగ్ చేసినట్లు చుట్టుపక్కల వారితో సంతకం తీసుకోవడం, వారి ఫోన్ నెంబర్ నమోదు చేయడం జరగాలని,
తాను స్వయంగా ర్యాండంగా గ్రామాల్లో పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రిజిస్టర్లు పరిశీలిస్తామన్నారు. కావున రికార్డు పక్కాగా నిర్వహించాలన్నారు.
తాగు నీటిని సరైన విధంగా క్లోరినేషన్ చేయాలని, ఇది చాలా ప్రాముఖ్యం అన్నారు. నీటి శాంపుల్స్ పరీక్షలు జరపాలన్నారు. వీటికి కూడా సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. ప్రైవేట్ ఆర్ ఓ ప్లాంట్లను కూడా తనిఖీ చేసి నీటి పరీక్షలు నిర్వహించి ద్రవ పత్రాలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. చేతులు శుభ్రం చేసుకోవడం, పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రత పట్ల పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు విద్యార్థులకు అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఓ ఆర్ ఎస్ ద్రావణం తయారీ విధానంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు గుర్తిస్తే, వెంటనే ఆ విషయం ఆయా పంచాయతీ కార్యదర్శులు లేదా ఎంపీడీవో లేదా మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు
గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఏఎన్ఎం అంగన్వాడి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తి భాగస్వామ్యంతో వ్యక్తిగత పరిశుభ్రత పై ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ సల్ఫేట్ టాబ్లెట్లు ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రెండు నెలల పాటు నిర్వహించే డఏరియా నియంత్రణ ప్రచార కార్యక్రమాన్ని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, ఆరోగ్య సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి. గీతాబాయి, డిపిఓ ఎస్వీ.నాగేశ్వర నాయక్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి టి. శివప్రసాద్, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప, పెడన మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, బాలసుబ్రమణ్యం, పి. వెంకటేశ్వరరావు, ఎం. వెంకటేశ్వరరావు, బి. వెంకట్రామయ్య, ఐసిడిఎస్ పిడి ఎస్. సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News