Breaking News

అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి

-పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన
-అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి
-కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి
-జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి
-కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం
-జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీశాఖ మంత్రి  పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిల్లో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, జోన్ల వారిగా జూపార్కుల ఏర్పాటు అంశంపై నివేదిక రూపొందించాలన్నారు. పర్యాటకం, పర్యావరణహిత పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు. సమావేశంలో అటవీశాఖ పీసీసీఎఫ్ (హెచ్.ఒ.ఎఫ్.ఎఫ్.) చిరంజీవి చౌదరి, పర్యాటక శాఖ కమిషనర్ కె. కన్నబాబు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎ.కె.నాయక్, డాక్టర్ శాంతిప్రియ పాండే, శరవణన్, డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, శ్రీకాంతనాథ రెడ్డి,  సి.సెల్వం, మంగమ్మ, ఎన్.నాగరాణి, ఎస్వీ యూనివర్శిటీ వెటరినరీ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ కె. వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *