– ప్రతి రోజు ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలి
– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండలి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్ళి తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతి రోజు రెండు గంటల పాటు నిర్దేశిత సమయాన్ని ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు. మండలి ప్రధాన కార్యాలయంతోపాటు రీజినల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు సమయం కేటాయించాలన్నారు. మండలి వెబ్ సైట్లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గం. నుంచి 5 గం. మధ్య ఫిర్యాదులు స్వీకరణ, సమస్యలు తెలుసుకొనేందుకు సమయం నిర్దేశిస్తామని మండలి సభ్య కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో మండలి అధికారులు ఎన్.వి.భాస్కర రావు, కె.శ్రీరామమూర్తి, శ్రీ పి.ప్రసాద రావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News