గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు నిర్దేశిత నిబందనల మేరకు మాత్రమే నిర్మాణం చేసుకోవాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) కోసం సిఫార్స్ చేసిన టిపిఎఎస్, సంబందిత వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులకు చార్జెస్ ఫ్రేం చేయాలని సిటి ప్లానర్ ని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ 7 వ లైన్ లో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాన్ని పరిశీలించి, నిబందనలకు విరుద్ధంగా ఫైల్ పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబందనలు ఉల్లంఘన చేస్తే తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను పలుమార్లు ఆదేశించినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బృందావన్ గార్డెన్స్ 7వ లైన్ లో ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న బహుళ అంతస్తు భవనం నిర్దేశిత నిబందనలకు 18 శాతం అతిక్రమించి నిర్మాణం జరిగిందని, అటువంటి భవనానికి ఓసి కోసం తమకు ఫైల్ పంపిన సంబందిత టిపిఎస్ రిజ్వానా, 117 వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి తనూజ లకు చార్జెస్ ఫ్రేం చేయాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ కి భిన్నంగా, రెసిడెన్షియల్ కు అనుమతి తీసుకొని కమర్షియల్ గా వినియోగిస్తున్న పలు భవనాల పై ఫిర్యాదులు అందాయని, నిబందనలు అతిక్రమించిన భవనాలకు నామమాత్రపు నోటీసులు ఇచ్చిన అధికారుల పై కూడా ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిబందనలు అతిక్రమించిన భవనాలను ఆకస్మిక తనిఖీలు చేస్తామని తెలిపారు.
ఎల్.టి.పి.లు నూతనంగా బహుళ అంతస్తు భవనాలకు అనుమతుల కోసం ఆన్ లైన్ ద్వారా డి.పి.ఎం.ఎస్.లో తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలు, నిబందనలకు అనుగుణంగా దరఖాస్తు చేయాలని, లేకుంటే తదుపరి అనుమతుల జారీ నిలిపివేయడం జరుగుతుందన్నారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ లో ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు.
పర్యటనలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, అసిస్టెంట్ సిటి ప్లానర్ మురళి, టిపిఎస్ రిజ్వాన, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News