గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘ కాలంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల వలన ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో భాగంగా నగరపాలక సంస్థ వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటి రేబిస్ టీకాలు చేయుటకు శాశ్వత కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశామని, ప్రజలు, జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సహకరించాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ జంతు సంక్షేమ సంఘం, హర్యానా వారి గుర్తింపు పొందిన స్నేహ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంచే 2023-26కు గాను గుంటూరు నగర పరిధిలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ, యాంటి రేబీస్ టీకాలు నిర్వహించడానికి ఒప్పంద అనుమతులు పొంది ఉన్నారని తెలిపారు. గుంటూరు నగరంలో షుమారు 35 వేల వీధి కుక్కలు ఉన్నాయని, వాటిలో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రస్తుతం 30 నుండి 35 వరకు ఆపరేషన్లు జరుగుతున్నాయని, వాటిని రోజుకి 50 వరకు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిఎంసి అధికారుల కమిటి పర్యవేక్షణలో నిర్దేశిత నిబందనల మేరకు స్థానిక ఏటుకూరు రోడ్ లోని ఏబిసి సెంటర్ లో నిపుణులైన పశువైద్యులచే వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి, అనంతరం వాటికి తగు వైద్యం, ఆహారం అందించి, కోలుకున్న 4 రోజుల పిదప ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మళ్లీ యధా స్థానంలో విడిచి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. గౌరవ హైకోర్ట్, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కేవలం వీధి కుక్కల నియంత్రణకు మాత్రమే అధికారం కలదని తెలిపారు. ప్రస్తుతం 6 నెలల వయస్సు లోపు, గర్భవతులుగా ఉన్న కుక్కలకు మినహా మిగిలిన వాటికి ఆపరేషన్లను చేయడం జరుగుతుందన్నారు. జూన్ 13 నుండి మొదలైన ఏబిసి కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 674 కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయడం జరిగిందని తెలిపారు. నగరంలో ర్యాబీస్ లక్షణాలతో వీధి కుక్కలను గుర్తిస్తే నగరపాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103 కి కాల్ చేసి వివరాలు అందిస్తే, ప్రాధాన్యత క్రమంలో వీధి కుక్కలను పట్టుకొని యాంటి ర్యాబీస్ వ్యాక్సిన్, ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కనుక నగర ప్రజలు, జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాలకు జిఎంసికి చెందిన నిపుణులైన సిబ్బంది వాహనంతో వచ్చినప్పుడు వీధి కుక్కలను పట్టించడంలో సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News